పుట:హంసలదీవి వేణుగోపాల శతకము.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సీ.

కన్నుల గాంతుగా కాంతుగా గోపాల
                   కాంతలు దలచు సాకారు నిన్ను
వీనులవిందుగా విందుగా మాధురీ
                   సుస్వరవేణుగీతస్వరంబు
కోరికఁ బారగా బారగాఁ గరములఁ
                   గొనియెత్తుకొందుగా కోర్కు లలర
మునుకొనియాడగాఁ గొనియాడుచుందుగా
                   దేవదేవుఁడవని తెలిసి మదిని


తే.

 నాఁడె వ్రేపల్లె జన్మింప కీడ నుంటి
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

37


సీ.

ఈడుబాలుర గూడి పాడుచు చేసంతు
                   లాడుచుండఁగ నిన్నుఁ జూడఁగల్గు
వాడచేడియలచేవాడికాడని తల్లి
                   తోడనాఁడగ నిన్ను జూడఁగల్గు
దూడలఁ గాయుచో నోడక రాకాసిఁ
                   గ్రీడలఁ బడఁగూల్పఁ జూడఁగలుగు
పోకల కన్నెలు పొడఁజూడ వేఁడగా
                   జాడలం దిరుగఁగా జూడగలుగు


తే.

 తొల్లి జన్మింపనైతి వ్రేపల్లెలోన
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

38


సీ.

జలకమార్చుదు నదీజనకపాదాంభోజ
                   రవికోటితేజోవిరాజ యనుచు
జోలపాడుదు నందబాల జగత్పాల
                   స్వర్ణచేల కృపాలవాల యనుచు
మేలుకొల్పుదు రమాలోల సద్గుణజాల
                   నీలకుంతల లసత్ఫాల యనుచు
ముచ్చటాడుదు సర్వమూలకంద ముకుందఁ
                   వినుత ననంద గోవింద యనుచు


తే.

తొల్లి జన్మించనైతి వ్రేపల్లెలోన
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

39