పుట:హంసలదీవి వేణుగోపాల శతకము.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సీ.

పాయసం బాజ్యధారాయుతంబుగ జేసి
                   యోడక జుఱ్ఱినట్లుండు మదికి
విడిపంచదార మీగడతోటి పదమంచి
                   యుడుగక మెసగినట్లుండు మదికి
అరటిపండులు తేనెలందు దోగఁగముంచి
                   యొనర భక్షించి నట్లుండు మదికి
పచ్చికొబ్బరిబెల్ల మెచ్చుగా దంచి నో
                   రూరంగా మెక్కినట్లుండు మదికి


తే.

నీకథావర్ణనము మాకు నిఖిలరుచులు
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

34


సీ.

కఠినాత్ము బండిఱక్కసు చకాచకలుగాఁ
                   బడదన్నుచో నొప్చిపట్టెనేమొ
తటభూజ మెక్కి చిత్రముగఁ గాళిందిలో
                   నవలీల దుముకుచో నవసెనేమొ
కాళీయఫణిణాగ్రములపై నర్తించు
                   నత్తరి పడగరా లొత్తెనేమొ
ఫల్గును నరదంబుపైనుండి భీష్ముపై
                   నలుక లఘించిన నలిగెనేమొ


తే.

చరణపద్మంబు లొత్తెద సామి రమ్ము
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

35


సీ.

శయ్యాహిబహుముఖోఛ్వాసనిశ్వాససాం
                   ద్రనినాదములచేత వినగరాదొ
క్షీరపారావారసారతరోర్మికా
                   ఘననినాదములచే వినగరాదొ
సాదివ్యసాలోక్యసారూప్యసేవక
                   స్తుతిరవంబులఁ జెవి సోఁకలేదొ
సకలబృందారకజయజయవాక్యగం
                   భీరనాదమున విన్పించరాదొ


తే.

ఎంత మొరబెట్టినను బల్క వేమి తండ్రి
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

36