పుట:హంసలదీవి వేణుగోపాల శతకము.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సీ.

శ్రీహరి స్మరణోక్తి సింహనాదము విన్న
                   బారవే యాపద్విపంబులుర్వి
అచ్యుతపాదపద్మార్చితాశనిధార
                   బడకుండునే వైరిపర్వతములు
నారాయణధ్యానమారుతాహతి జేసి
                   పాయవే పాపౌఘతోయదములు
ఖగరాజగమనకైంకర్యాదిరుచులచే
                   సమయవే యజ్ఞానతిమిరజాల


తే.

మనుచు నీ భక్తి బాయక యనఘు లండ్రు
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

31


సీ.

వక్షస్థలము దివ్యవయిజయంతీకౌస్తు
                   భాంతరశ్రీదేవి యందగింప
కరచతుష్టయము విస్ఫురిత శంఖదాంగ
                   ఖడ్గకార్ముకముల గారవింప
శ్రోణీతలము స్వర్ణసూత్రసమంచిత
                   హేమదుకూలంబు నానుతింప
మూర్ధంబు రత్నజాంబూవదద్యుతినిష్క
                   శంకకోటీర మలంకరింప


తే.

దీపితంబగు నీమూర్తిఁ జూపుమయ్య
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

32


సీ.

వరదివాకరనిశాకరులు నీనేత్రంబు
                   లాననకాంతి సమాన మేది
పరమేష్టి నీనాభిబద్మనివాసుండు
                   జఠరసంపద కెన్న సామ్య మేది
కమలజాండములు నీకరకందుకంబులు
                   దోర్బలంబున తులదూగ నేది
నిఖిలతరంగిణుల్ నీసపాదకములు
                   శ్రీపారమహిమానురూప మేది


తే.

కవులు కవితల వర్ణింపఁగలరె నిన్ను
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

33