పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లక్షణసారసంగ్రహమను నామమునకు ముందొకపదమునుఁ జేర్చి పేరుమార్చిన లక్షణశాస్త్రజ్ఞులు గొందఱున్నారు. కూచిమంచి తిమ్మకవి సర్వలక్షణసారసంగ్రహమును, ఉప్పులూరి వేంకటరెడ్డి సకలలక్షణసారసంగ్రహమును గూర్చిరి.

తిమ్మకవికృత లక్షణసారసంగ్రహము కొంత చిత్రముగా నున్నది. సంస్కృత గ్రంథములనుండియు, తెలుఁగు పుస్తకముల నుండియు నుద్ధృతముల నెత్తి కనఁబఱచుటయే గాక గ్రంథాదుల నామాదులను సంస్కృతభాషలోనే యిట్లుతెలియఁజేసినాఁడు. ఉదాహరణములు:-

'ఆంధ్ర భాషాయామ్- అధర్వణ ఛందసి' 'కవిసర్పగారుడే' 'మగణస్య' ఇత్యాదులు.

ఇట్లు కవి తనకుఁ గల సంస్కృతభాషాభిమానమును వెల్లడిచేసికొన్నాఁడు. లేఖకుల ప్రమాదము వలననే అక్కడక్కడ నట్టిసందర్భములలోఁ దెలుఁగు పదములు దొర్లినవి. అట్టివానిని నేను మార్చలేదు.

లక్షణగ్రంధములను రచించుటలోఁ బ్రాచీను లొక్కొక్క రొక్కపద్ధతి నవలంబించినట్లు తోఁచుచున్నది. కొందఱు అక్షరాదుల యాధ్యాత్మికప్రభావము (స్పిరిచ్యుయాలిటి)నకుఁ బ్రాముఖ్యము నిచ్చి రచించినారు — కవివాగ్బంధము, కవిరాజగజాంకుశము నిట్టివియే. మఱియుఁ గొందఱు గణయతిప్రాసవృత్తాదులను బ్రధానముగా నెంచినారు. అనంతుని ఛందస్సు, ముద్దరాజు రామనకవి సంజీవిని, మొదలగునవి. ఇంకను గొందఱు వ్యాకరణాద్యలంకారములఁగూడ సదసముగా జేర్చినారు – కావ్యాలంకారచూడామణి, అప్పకవీయము వంటివి.