పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తన లక్షణసారసంగ్రహములో నితరకవులను, కావ్యముల నెన్నింటినైన నుదాహరించియున్నాఁడు. పెద్దన యట్టిపనినిఁ దలపెట్టలేదు. కాబట్టి యుదాహృతపద్యములుగల పెద్దపుస్తకమేదో పెద్దన వ్రాసినది గలదని మనము భావింపనక్కఱలేదు. పెద్దన తనగ్రంథమున లక్ష్యములనన్నింటినిఁ దానే వ్రాయుటచేత గాఁబోలు తిమ్మన యితరులలక్ష్యములను జూపుపుస్తకమును వ్రాయుటకు దొరగొని, దానికిఁకూడ నదియేపేరుఁ పెట్టినాఁడు. పెద్దన తిమ్మనలు వ్రాసిన పుస్తకములపే రొక్కటియే యగుటచేత నింతగజిబిజి పుట్టినది. తిమ్మన తన పుస్తకమునకు లక్షణసారసంగ్రహమని పేరు పెట్టుకొని, దానిని మంచిలక్షణసారముగాఁ జేసెదనని ప్రతిజ్ఞ చేసినాఁడు.

క.

లక్ష్మణశాస్త్రము లెల్లఁ బ
రీక్షించుటఁ గొంతకొంత యెఱిఁగిన వాఁడన్
లాక్షిణికా నుగ్రహతను
లక్షణసారం బొనర్తు లక్ష్యము లమరన్.

పుస్తకతత్త్వమును దెల్పుమాటయే తర్వాత దానికిఁ బేరై వెలసినది. పేర్లలోని గజిబిజిని లోకులు సులక్షణసారమను పేరిడి తీర్చినారు.

లక్షణసారసంగ్రహమను మఱియొక A Triennial catalogue of Manuscripts 1913-14 to 1915-16. R No. 285 పుట 691 పుస్తకమున్నది. ఇది సంకలనగ్రంథము. కూర్పరిపేరు దంతి యప్పకవియని భావింపబడుచున్నది. ఇది సమగ్రముగానున్నది. దీనిలో సులక్షణసారము, కవిజనాశ్రయము, అనంతచ్ఛందము, వాదాంగచూడామణి, కవిసర్పగారుడము మున్నగు గ్రంథముల భాగములుగలవు. ఇందలి ప్ర్రారంభపద్యము సులక్షణసారపద్యముకంటె వేఱుగానున్నది. ఇది తిమ్మకవి కృతమగు సులక్షణసారముకంటె వేఱు.