పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తిమ్మకవి వ్రాసిన లక్షణగ్రంథమునకు సులక్షణసారమను పేరొక్కటియె గలదా, లేక మఱియొకపేరు గూడ నున్నదా? నాకు దొరకిన తాళపతిపత్రిలో ప్రారంభ పద్యమునకు మున్ను లక్షణసారసంగ్రహమనియే కలదు, కాని వేఱొక్కటిలేదు. కావున దీనిముఖ్యనామము లక్షణసారసంగ్రహమనియు, సులక్షణసారమనునది రెండవపేరనియు గ్రహింపవచ్చును. ఈపుస్తకముయొక్క అసలు పేరు లక్షణసారసంగ్రహమని దెలియక పోవుటచే బెక్కు చిక్కు లేర్పడినవి.

తిమ్మకవి కంటె నించుక పూర్వుఁడైన చిత్రకవి పెద్దన్న యొక లక్షణసారసంగ్రహమును రచించియున్నాఁడు. ఇట్లు వీరిరువురు రచించిన గ్రంధములకు నొకే పేరుండుటచేఁ జిక్కులు ప్రాప్తించుటలో చిత్రము లేదు. కాఁబట్టి దీని రెండవ పేరైన సులక్షణసారము ప్రచానములోనికి వచ్చినది.

మానవల్లి రామకృష్ణకవిగారు కొన్నిచోట్ల లక్షణసారసంగ్రహమనియు, దానికర్త పెద్దన్న లేక చిత్రకవి పెద్దనయనియుఁ జెప్పుచు, నందుదహరింపఁబడిన కవులను, కావ్యములకు, గుఱించి చెప్పిరి. చిత్రకవి పెద్దన్న వ్రాసిన లక్షణసార సంగ్రహము మనకు లభించినది; ఆంధ్రసాహిత్యపరిషత్తు వారు ప్రకటించిరి. కాని మానపల్లి రామకృష్ణకవిగారు చెప్పిన కవులు నామములు గ్రంథములు నందు మచ్చునకైనఁ గన్నింపవు. లక్షణసారసంగ్రహమును చిత్రకవి పెద్దన వ్రాసెనను విషయ మెఱిఁగిన రామకృష్ణకవిగారికి మొదలు తుదలు లేని లక్షణసారసంగ్రహప్రతి యేదియో లభింపగా, దానిని వారు చూచి యది చిత్రకవి పెద్దన రచించిన గ్రంథముగా భావించి, ఫైవిధముగా వ్రాసియున్నారనియు, వారికి దొరికిన ప్రతి పెద్దన విరచితము కాదనియు, నిప్పుడు స్పష్టమగుచున్నది. తిమ్మకవిమాత్రమే