పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చున్నది. అట్టిపశ్నకుఁ దగినకారణము లేకపోలేదు. సాధారణముగా శాస్త్రగ్రంథములలో ననేకముఖ్యకవుల గ్రంథములనుండి భాగముల నెత్తి యొకచోట వ్రాసికొను నాచారముగలదు. ఇట్టివి సంకలనగ్రంథములు. నాకు లభించిన పుస్తకము గూడ నొక సంకలనగ్రంథమేనా?

తిమ్మకవి తనవంశాదికమునుగుఱించి చెప్పుకొన్న మీఁదట గ్రంథరచనకుఁ దొడంగినాఁడు. ఈగ్రంథములో నున్న పద్యములే మిగత లక్షణగ్రంథములలోఁ దిమ్మకవి గ్రంథములోనివి యని యుదాహరింపఁబడినవి. సులక్షణసారములోనివని వీరేశలింగముగారు తమ కవులచరిత్రలో నెత్తి చూపించిన కవుల నామములు, పద్యములు నాగ్రంథములోఁగలవు. తిమ్మకవి క్రీ. శ. 1560 ప్ర్రాంతపువాఁడు. గ్రంథభాగములో నుదాహరింపఁబడిన కవుల నామములు గ్రంథములు క్రీ. శ. 1560 కి పూర్వపువెగాని తర్వాతివి కాఁజాలవు కదా! కావున నిది సులక్షణసార భాగమేగాని వేఱొండు కాదని ఖండితముగాఁ జెప్పవచ్చును. ఈ భాగ మొకపూర్తిప్రకరణమైనను గాకుండుటచే ఇది గద్యకైనను నోచుకొనలేదు.

లింగమగుంట తిమ్మకవికాలమును గుఱించి వాదోపవాదములు లేవు. ఇతఁడు క్రీ. శ. 1560 ప్రాంతపువాఁ డనియె పెక్కుమంది యుద్దేశము. ఇతనికిఁ గొంచెముగా ముందువెనుకలనున్న లక్షణకవుల నామములనుఁ దెలిసికొనవచ్చును.

వెల్లంకి తాతంభట్టుక్రీ.శ.1480 ప్రాంతము
చిత్రకవి పెద్దన్నక్రీ.శ.1550 ప్రాంతము
ముద్దరాజు రామనక్రీ.శ.1550 ప్రాంతము
లింగమగుంట తిమ్మకవిక్రీ.శ.1560 ప్రాంతము