పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇప్పుడు దొరకిన యీసులక్షణసార భాగములో నక్షరగణాదుల దివ్యత్వము దెల్పఁబడినది. తిమ్మకవి వ్రాసిన పూర్తిగ్రంథ మెట్లుండునో మనమూహించుకొనుటకుఁగూడ నొకచక్కని మార్గమున్నది. ఈకవిగ్రంథమును సన్నిహితముగా ననుసరించి గ్రంథరచన చేసినవాఁడు కస్తూరిరంగకవి. అతని గ్రంథము పేరు ఆనందరంగరాట్ఛందము. సులక్షణసారము పోయినను కస్తూరిరంగకవి గ్రంథము మిగిలిన యెడల సుక్షణసారము నూటికి దొంబదిపాళ్లు మిగిలినదనియే చెప్పవచ్చును. కాఁబట్టి మనకు దొరకని భాగము రంగకవియొక్క ఆనందరంగరాట్ఛందములోని తక్కినభాగమువలె నుండునని యూహింపవచ్చును.

లక్షణసారసంగ్రహములో ననేకకవుల నామములు కావ్యములు నుద్ధరింపబడినవి. వాని నిక్కడ సంస్కృతమునకునుఁ, దెలుఁగునకును వేఱువేఱుగా వర్గీకరించి చూపెదను.

సంస్కృత లక్షణగ్రంథములు

  • అలంకారచూడామణి
  • అలంకారసంగ్రహము
  • కవికంఠపాశము
  • గోకర్ణచ్ఛందస్సు (ఋషిప్రోక్తే)
  • చమత్కారచంద్రిక
  • నానాలంకారము
  • లక్షణాదినికాయము (వీరాద్యుఁడు)
  • వృత్తరత్నాకరము (కేదారకవి)
  • సాహిత్యచంద్రోదయము
  • సాహిత్యచూడామణి
  • సాహిత్యరత్నాలయము
  • సాహిత్యరత్నాకరము

సంస్కృతోదాహృతగ్రంథములు

  • అమరుకము
  • ఉత్తరరామాయణము
  • ఏకావళి
  • కాలనిథానము
  • కుమారసంభవము (కాళిదాసు)
  • కుసుమాయుధ వ్యాకరణము
  • కృష్ణజయము (కృష్ణభట్టు)