పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఇనుఁ డగ్రహ మవని బీజము
తనురుచి శ్యామంబు తుష్టిదంబు ఫలంబా
జననము బ్రాహ్మ్యము కాముఁడు
గనుగొన నధినాయకుండు ఇ కారంబునకున్. (3)

148


క.

అనలము బీజము రవి గ్రహ
మనుపమరుచి పీత మన్వయము బ్రాహ్మ్యము తు
ష్టినయంబు ఫలము దేవత
యెనయఁగ శ్రీ యెంచిచూడ ఈ మాతృకకున్. (4)

149


క.

ఇల బీజము నీలము రుచి
ఫలంబు కామదము గ్రహము భానుండు బ్రాహ్మ్యం
బల రెడ్డికుల మధిదేవత
కలితస్థితి కాళి తా ఉ కారంబునకున్. (5)

150


క.

ధర బీజము శ్యామరుచి
తరణి గ్రహము ఫలము కామదము బ్రాహ్మ్యం దా
వరవంశం బధిదేవత
యురుతరముగ దేవమాత ఊ మాతృకకున్. (6)

151


క.

నీరము బీజము వర్ణము
గౌరము బ్రాహ్మ్యంబు కులము గ్రహ మర్కుండు కౌ
మారి తలంప నధిదేవత
యారయ సుతహాని ఋ నకు నార్యజనోక్తిన్. (7)

152


క.

సలిలము బీజము బ్రాహ్మ్యము
కుల మినుఁడు గ్రహంబు పుత్రకుల నాశము దా
ఫలము రుచి యంజనము స
ట్టిలఁదా వారాహిదేవి ౠ మాతృకకున్. (8)

153