పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామయని జెప్పగా, తిమ్మకవి లక్ష్మణ యని చెప్పినాఁడు. మొత్తముమీఁద నివి విశేషప్రమాదకరమైన భేదములై, సిద్ధాంతములను దాఱుమాఱుచేయునవి గాకుండుటచేఁ బ్రస్తుతము విడువబడినవి.)

పైవంశములోని వారిలో -

(1) సర్వకవి కవిసార్వభౌముఁడని వర్ణింపఁబడినాఁడు. ఇతఁడు క్రీ. శ. 1500 ప్రాంతపువాఁడు కావచ్చును. రచించిన గ్రంథములేవో తెలియవు.

(2) రామకవి క్రీ. శ. 1350 ప్రాంతపువాఁడు కావచ్చును. ఆనందకాననమాహాత్మ్యము, చతుర్వాటికామాహాత్మ్యము, వేంకటమాహాత్మ్యము, మత్స్యపురాణము, వామనపురాణమునను గ్రంథములను రచించెను. వీనిలోఁ జివరి మూఁడు లభించుటలేదు. ఇతఁడు సుప్రసిద్ధకవియైన తెనాలి రామలింగని యల్లుఁడు.

3) తిమ్మకవి కీ. శ. 1560 ప్ర్రాంతపువాఁడు. అన్నదమ్ము లిరువురునుఁ జిక్కంభట్టరుయొక్క శిష్యులు. ఇతఁడు రామభక్తుఁడు. తిమ్మన సులక్షణసారమును రచించెను. బాలబోధయను మఱియొకలక్షణగ్రంథమునకుఁగూడఁ గర్తయని పండితులు గొందఱు చెప్పుచున్నారు. దీనిని గుఱించి కొంచె మిక్కడ వివరించెదను.

“బాలబోధఛందస్సుకర్త పేరెఱుంగరాదు. అందు బహుప్ర్రాచీనగ్రంథము లుదాహృతములయ్యెను. ప్రాచ్యలిఖితపుస్తకశాలలోఁ గొంత, మానవల్లి రామకృష్ణ కవిగారిదగ్గఱఁ గొంత కలద”ని వేటూరి ప్రభాకరశాస్త్రిగారు చెప్పిరి. మానవల్లి రామకృష్ణకవిగారు దీనికి బాలబోధమనియు, గవిసంజీవినియనియు సందిగ్ధనామములు గలవని వ్రాసియున్నారు. "లింగమగుంట తిమ్మన బాలబోధచ్ఛందస్సును వ్రాసినట్లు పాకనాఁటియందుగల కౌలూరి యాంజనేయకవి తనసుకవికర్ణామృతమను లక్షణగ్రంథమున నుడివియున్నా”