పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లక్షణసారసంగ్రహము

అను

(సులక్షణసారము)

క.

శ్రీ వనితాసమ భూతన
యా వక్షోజార్ద్రకుంకుమాంకిత వక్షున్‌
బావనతర చారిత్రుని
సేవించెదఁ జదలువాడ శ్రీరఘురామున్‌.

1


సీ.

శ్రీ వైష్ణవహితుండఁ, జిక్కయభట్టరు
                       శిష్యుఁడఁ, గవితావిశేష శేష
తులితసర్వార్యుపౌత్రుఁడ, లక్ష్మణయకుఁ ది
                       మ్మాంబకు సుతుఁడ, వీరనకు మార
నకు రామకవివర్యునకు ననుజన్ముఁడ,
                       నా రామకవి చెప్పినట్టి మహిత
మత్స్యపురాణ వామనపురాణాది స
                       త్కవితలకెల్ల లేఖకుఁడ వృద్ధ


గీ.

కుంఠికాతీరలింగమగుంటనామ
పట్టణస్థితికుండ సౌభాగ్యయుతుఁడ
నాదిశాఖాప్రవర్తన నమరువాఁడఁ
గాశ్యపసగోత్రుఁడను దిమ్మకవిని నేను.

2


క.

లక్షణశాస్త్రములెల్లఁ బ
రీక్షించుటఁ గొంతకొంత యెఱిఁగినవాఁడన్‌
లాక్షణికానుగ్రహత సు
లక్షణసారం బొనర్తు లక్ష్యము లమరన్‌.

3


తే.

కొంద ఱెంచు లక్షణములు కొంద ఱెంచ
రందఱును నెంచినవి కొన్ని యవియు నవియు
దొరయఁగాఁ గూర్చి కవిసమ్మతులను వ్రాయు
దొకటికొక్కటి సంస్కృతాంధ్రోక్తు లెనయ.

4