పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బహుబ్రశంసనీయము. వారిచే నితరగ్రంథములనుండి సేకరింపఁబడినట్టి యాపద్యములు మూలగ్రంథమైన లక్షణసారసంగ్రహములో నేక్రమములో నున్నవో యిప్పుడు పరిశీలింపవచ్చును. ఈపుస్తకములోఁ బాఠాంతరములు నట్లేయుంచితిని. దీనిలోని పద్యములకు సంఖ్యలను నేనిచ్చితిని.

పీఠికను ముగించుటకుముం దీతాళపత్రప్రతినిగుఱించి మఱియొకమాట చెప్పవలసియున్నది. దీనిని వ్రాసిన లేఖకుఁడు నావలెనే పండితుడు గాఁడు. ఉత్సాహవంతుఁడు. అతని యుత్సాహమువలననే మనకీ పుస్తకభాగ్యము దక్కినది. కాని పాండిత్యము లేకపోవుటచేఁ బంక్తి యొక్కంటికిఁ బదితప్పులకుఁ దక్కువలేని పంక్తి యీ గ్రంథములో లేదు. ఇతరగ్రంథముల సహాయముస దీనిలో నొక మార్గమును గనుఁగొనఁగలిగితిని. అట్టిసహాయము లేని చోట్ల సంస్కరణకుఁ దగ్గించితిని, ఉన్న బాధలకుఁదోడు మఱియొకటి కలదు. తాళపత్రప్రతిలో అరసున్నలన్నియు నిండుసున్నలుగా నుండును వానిసంస్కరణ వేఱొకపని. ఇట్టిది బహుబాధకరమైన కార్యమైనది. శక్తివంచనలేక కృషి చేసితిని.