పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

80

శ్రీ సీతారామాంజనేయసంవాదము

గును. ధర్మార్థకామమోక్షములకంటె వేఱై కోరఁదగినవస్తువేదియును లోకమున లేదు కదా! కావున ఓ పార్వతీ! ఈరామనామప్రభావము నెంత యని వర్ణింపఁగలను? నా కీవర్ణన మలవి గాదు.

పంచక్లేశవివరణము.

అవిద్యాక్లేశము, అభినవక్లేశము, అస్థిగతక్లేశము, రాగక్లేశము, ద్వేషక్లేశము, అని క్లేశము లైదువిధములు. అందు నేను జీవుఁడ నని నిర్ణయించుట అవిద్యాక్లేశము. సంసారమును, దానికి కారణమయిన మనస్సును పరిత్యజింపకుండుట అభినవక్లేశము. విషయాభిలాష కలిగి విఱ్ఱవీగుచుండుట అస్థిక్లేశము. అర్థములయందు అధికానురక్తికలిగి యుండుట రాగక్లేశము, ఉదరపోషణార్థము పరుల నాశ్రయించి వారివలన తన యభిమతము కొనసాగనందున వారల దూషించుట ద్వేషక్లేశము.

అష్టపాశవివరణము.


క. దయయు జుగుప్పయు మోహము, భయమును సంశయముఁ గులము బలశీలము ల
   న్నియుఁగూడ నష్టపాశము, లయి వెలయును వాని నాత్ముఁ డంటకయుండున్.

(శుక చరిత్రము.)


 

అష్టకష్టములవివరణము.


    "శ్లో. ఋణం యాచ్ఞా చ వృద్ధత్యం జారచోరదరిద్రతాః,
          రోగశ్చ భుక్తశేష శ్చా స్యష్ట కష్టాః ప్రకీర్తితాః."

క. అచ్చటనె సరస్వతియును, నచ్చట భాగీరథియును యమునానదియున్
   నచ్చట సమస్తతీర్థము, లెచ్చట శ్రీరామనామ మెప్పుడు గలుగున్.

టీక. శ్రీ రామనామము, ఎచ్చటన్ = ఏస్థలమునందు, ఎప్పుడున్, కలుగున్ = జపింపఁబడుచుండునో, అచ్చటనే = ఆస్థలమునందే, సరస్వతియున్ = సరస్వతీనదియును, అచ్చటన్ = ఆస్థలమునందే, భాగీరథియున్ = గంగానదియును, అచ్చటన్, సమస్తతీర్థములు, (కలుగున్) యమునానదియున్ (కలుగున్ అని అధ్యాహార్యము.)

తా. ఏస్థలమునందు రామనామజపము సర్వకాలములయందును జరుగుచుండునో ఆస్థలమునందే సర్వతీర్థోత్తమములని చెప్పదగిన గంగాయమునాసరస్వతులు, మఱియు లోకమునఁగల సకలతీర్థములును ఎప్పుడును నివసించుచుండును. కావున నాస్థలము సర్వతీర్థమయమై చూచువారలకును గూడ మోక్షమును గలిగించుచుండును.

తే. తెలివి శ్రీరామనామసుధారసంబు
   నమృతులై గ్రోలుభక్తుల కమృత మేల?