పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

76

శ్రీ సీతారామాంజనేయసంవాదము


(రామనామమనియెడు మంత్రము. (మంతారంత్రాయత ఇతి మంత్రః - ధ్యానించువానిని రక్షించునది), అర్థులకున్ = యాచకులకు, ఈప్సితంబులన్ = కోర్కులను, ఇచ్చుచుండన్ = ఇచ్చుచుండఁగా, కాంచి చూచి, కల్పతరువు = కల్పవృక్షంబును, కామధేనువు = కోరినకోర్కుల నీయఁజాలు కామధేనువును, అలఘు = గొప్పది యగు (అనగా: కోరినకోర్కుల నిచ్చువానిలోనుత్తమమగు; చింతామణియును, నెఱిన్ = మిగుల, సిగ్గుపడుచుండున్ .

తా. ఓ పార్వతీ, మూలప్రకృతికి మనోహరుం డగు (లేక, లక్ష్మీనాయకుఁడగు) నా రాముని నామమంత్రము తన్ను సేవించువారలకు కోరినకోర్కుల నెల్ల— (మోక్షమునుసహితము) నిచ్చుచుండుటను జూచి, "మన క ట్లన్నికోర్కు లిచ్చుటకు శక్తి లేదు కదా నిరర్థకముగా కల్పవృక్షము కామధేనువు చింతామణి అను ప్రసిద్ధిని మాత్రము జెంది యున్నాము. ఈ ప్రసిద్ది హాస్యకారణ మగుచున్నది” అని కల్పవృక్షాదులు మితి లేని లజ్జచే బాధింపఁబడుచుండును. (అనఁగా : కల్పవృక్షమునకంటెను, కామధేనువునకంటెను, చింతామణికంటెను అధికముగా ఈరామనామము భక్తులయభీష్టముల నొసంగుననుట.)

-: శ్రీ రామనామమంత్రోపాసనాఫలము :-

సీ. ధర్మార్థులకు సర్వధర్మంబులొనగూర్చు
           నర్దార్థులకుఁ జేయు నర్థములను
    గామార్థులకు నెల్లకామంబుల నొసంగు
           నాత్మజార్థుల కిచ్చు నాత్మజులను
    శ్రీధృతిస్మృతియశశ్శ్రేయస్సుఖక్షమా
           విద్యార్థులకు వాని వెలయ నిచ్చు
    ఛత్రచామరగజాశ్వప్రభుత్వార్థుల
           కవియు సంపాదించు ననవరతముఁ
తే. జంద్రసూర్యాలయంబుల స్వర్గలోక
    సత్యవైకుంఠకైలాససదనములను
    గోరువారల కవియుఁ జేకూఱఁ జేయు
    రామనామంబు విలసిల్లి రాజవదన.

టీక. రాజవదన = పార్వతీ, రామనామంబు, విలసిల్లి = ప్రకాశించి, అనవరతమున్ = ఎల్లప్పుడును, ధర్మార్థులకు = ధర్మమును కోరువారికి (అనఁగా : స్వకులాచారధర్మముల నేకాగ్రచిత్తముతో నాచరించి దానిచే కృతార్థులు కాదలంచువారికి), సర్వధర్మంబులు = సమస్తమైన ధర్మములను, ఒనఁగూర్చున్ = కలిగించును