పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

70

శ్రీ సీతారామాంజనేయసంవాదము


జేసినసమయమునందే, అఖిలపాతకములచేన్ = సమస్తము లైనపాతకములచేతను, విడ్వఁబడున్ సుమ్ము = విడిచిపెట్టఁబడును సుమా!

తా. ఓ పార్వతీ! రామనామమును జపింపవలయు ననియు అట్లు జపించిన సకలపాపములును దొలఁగి పోవు ననియుఁ దెలియక పోయినను, ఆజపమునందు శ్రద్ధ లేకపోయినను, ఏది యైననొక కారణమువలనఁ బ్రమాదమువలన నైనను రామనామము నొక్కమాఱైనను స్మరించినఁజాలును. సింహ మనిన పేరు వినినతోడనే భయముఁ జెంది పరుగిడులేళ్లు ఆసింహమును ప్రత్యక్షముగాఁజూచిన నచ్చట బొత్తిగనే నిలు వనియట్లు, రామనామ మనినతోడనే భయము నొందుపాపములు ఆనామము నుచ్చరించిన క్షణముననే సంపూర్ణముగ తొలఁగిపోవును.

తే. అనవరత రామనామకీర్తనపరుండు
    వెనుకటియఘంబులఁ దలంచి వెఱవవలదు
    ఘనత నేనుఁగు నెక్కి కుక్కలను గాంచి
    భయపడఁగ నేల మనుజుఁ డోపంకజాక్షి.54

టీక. ఓపంకజాక్షి = పద్మములవంటినేత్రములు గల పార్వతీ! అన... రుండు - అనవరత-ఎల్లపుడును, రామనామ = రామనామముయొక్క, కీర్తన = జపించుటయందు, పరుండు = ఆసక్తి గలవాఁడు. (లేక, రామనామకీర్తనమే ముఖ్యము గాఁగలవాడు; అనఁగా: మనఃపూర్వకముగా నాజపము నాచరించువాఁడు) వెనుకటియఘంబులన్ = తానంతకు పూర్వము చేసిన పాపంబులను, తలంచి, వెఱవన్ వలదు = భయపడనక్కర లేదు. (ప్రమాదముగా రామనామమును జపించినను, సకలపాపములు పోవుచుండ సర్వకాలములయందును భక్తియుక్తుఁడై యాజపము నాచరించువానికి పాపభయము గల్గునాయని భావము.) మనుజుఁడు = మనుష్యుడు, ఘనతన్ = గొప్పగా, ఏనుఁగును, ఎక్కి, కుక్కలను, కాంచి = చూచి, భయపడఁగన్ ఏల = ఏలభయపడవలయును.

తా. ఓకమలలోచనా! రామనామమును జపింపవలయు ననుసంకల్పమే లేక ప్రమాదమువలన నొక్కమాఱు "రామ" యనినను, సకలపాపములు తొలగిపోవుచుండ సర్వకాలములయందును భక్తియుక్తుఁడై రామమంత్రజపము నాచరించువాఁడు "ఇంతకుముందు నే ననేక పాపముల నాచరించితినే" అని ఏల భయపడవలయును? ఏనుఁగుపై నెక్కినవాఁడు క్రిందనున్న కుక్కలు తన్ను కఱచునని భయపడునా? ఎప్పటికిని భయపడఁడు.

క. ఇలలోన రామనామము, సులభంబై వెలుఁగుచుండఁ జులకఁగఁ బలుకం
   గలనాలుక కలగఁగ న, ల్పులు మిన్నక నరకములను బొందెద రకటా! 55