పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర థ మా శ్వా స ము.

71


టీక . ఇలలోనన్ = భూమియందు, రామనామము, సులభంబు ఐ = సుఖముగ దొరకునదియై, వెలుఁగుచున్ ఉండన్ = ప్రకాశించుచుండఁగా, చులకఁగన్ , పలుకం గల నాలుక = ఉచ్చరించుశక్తి గల నాలుక, కలుగఁగన్ = ఉండఁగ, అల్పులు = జ్ఞానహీనులు, మిన్నకన్ = నిరర్థకముగ, నరకములన్ , పొందెదరు, అకటా = అయ్యో

తా. ఇట్లు రామనామము సర్వజనులకును అనాయాసముగనె దొరకునదియై యున్నను , దానిని సుఖముగ నుచ్చరింపఁగలవారలయి యుండినను (అనఁగా: దాని ననాయాసముగ నే యుచ్చరింపఁ గలిగి యున్నను, జ్ఞానహీను లగువారు ఆమంత్రజపమును జేయక పాపములకు లోఁబడి నరకములఁ జెందు చున్నారు. ఆహా ! ఇంతకంటె వేఱాశ్చర్య మేమి గలదు?

ఉ. ప్రాపుగ రామనామము నిరంతరమున్ భజియించువారికిం
    బాపము లే దటంచుఁ బెనుపామును బట్టఁగ వచ్చు నగ్ని సం
    దీపితలోహఖండము నతిత్వరితంబుగ మ్రింగవచ్చు బ
    ల్కోపముఁ బెంచుపెద్దపులికోఱలుఁ దీయఁగవచ్చు నిద్ధరన్. 56

టీక. ఇద్దరన్ = భూమియందు, ప్రాపుగన్ = ఆశ్రయ మగునట్లుగ, (అనఁగా : ఆరామునేశరణముగా నమ్మి) రామనామమున్ , నిరంతరమున్ = ఎల్లప్పుడును, భజియించువారికిన్ = సేవచేయువారికి, (అనఁగా : జపము సేయుచు, దాని యర్థమును, పరబ్రహ్మమును, మనసున ధ్యానము చేయువారికి పాపము లేదు) అటంచున్ = అని చెప్పుచు, పెనుపామున్ = పెద్దపామును, పట్టఁగన్ వచ్చున్ = ( శపధము చేయుటకై), పట్టుకొనవచ్చును. అగ్ని . . .డమున్ - అగ్ని = అగ్నిహోత్రము చేత, సందీపిత = బాగుగఁ గాల్చఁబడిన, లోహఖండమునున్ = ఇనుపతునకను, అతిత్వరితంబుగన్ = మిగుల త్వరతో, మ్రింగన్, వచ్చు , బల్...ఱలు - బల్కోపము = విశేషమగు కోపమును, పెంచు = వృద్ధిఁజెందించు, పెద్దపులికోఱలు, తియ్యఁగన్ వచ్చున్

తా. రామనామమే శరణ మని నమ్మి దాని సర్వదా జపించుచు దానియర్థమగు పరబ్రహ్మమును సర్వదా ధ్యానించుచు నుండువారలకుఁ బాప మేమాత్రము నంటదని చెప్పుచు నెట్టిఘోరప్రతిజ్ఞల నైనను జే యవచ్చును. అత్యుగ్ర మగుసర్పమును జేతితో పట్టుకొనవచ్చును. బాగుగఁ గాలినయినుపతునుక నైనను మ్రింగవచ్చును. మిగులఁ గోపము కలిగియున్న పెద్దపులిని సమీపించి దానికోఱలను గూడ బలాత్కారముగ నూడఁబెరుకవచ్చును. ఇట్లెన్ని సాహసములు చేసినను సత్యప్రభావము వలన నాపురుషున కేమియును బాధ కలుగనేరదు.

క. ఏపాపము నైనఁ దగం, బాపఁ గలదు రామనామభజనపరునకున్
   బాపము గలదనిపలుకుమ, హాపాతకియఘమునడఁప నదియో దిలన్.57