పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

56

శ్రీ సీతారామాంజనేయసంవాదము


దున్న పరబ్రహ్మమునుగూర్చియే చెప్పును గాని శరీరమును గూర్చి యెన్నటికిని జెప్పదు. ఆపరబ్రహ్మమునకు స్వభావముగ నేయుపాధులును లేవు. కావున రుద్రనామముగల నేనును, విష్ణునామము గలయాహరియును నొక్కటియే. కావున నీరామనామము విష్ణువాచకమైనట్లే రుద్రవాచక మగును. ఇంతయేల? భ్రాంతివలన కనుఁగొన నేరకపోవుటయే కాని చక్కగ విచారించినలోకమున వ్యవహారమునందున్న సర్వ నామములు నిట్టివేకదా అనగా: పరబ్రహ్మము నెఱిగించునవియే కదా! ఇట్లగుటచేత నేను సర్వ కాలములయందును రామపదవాచ్యుఁ డగు నాపరబ్రహ్మమునందే, అనఁగా; నాయందే క్రీడించుచుండు నని తెలిసికొనుము. "రమియింతు రామునియందు" అని చెప్పుట రామునకును "నాకును భేదము కలదు" అని నిరూపించుటకుఁ గాదనియు, పరబ్రహ్మమును తెలిసికొనవలయును” అను మొదలగు వాక్యములయం మువలె నే ఆరామపదము పరబ్రహ్మవాచకముగా మాత్రమే యుపయోగింపఁబడిన దనియుఁ దెలిసికొనుము. పైనిరూపించినయుక్తి వలన "రామనామము పరబ్రహ్మమును జెప్పును" అనునిషయములోఁ గొంచెమైనను సంశయింపవలసినపని లేదు.

-:శ్రీ రామనామ ప్రభావము:-

ఆవ. ఇట్లు రామనామమంత్రార్థమును వివరించి, సాధకులకు దానియం దభిరుచిని గలిగించుటకై యర్థవాద ముపక్రమించు చున్నాఁడు__

తే. రామ తారకపావనరామనామ
    మెంతపాపంబు నడగించు నంతయఘము
    శ్వపచుఁ డైనను జేయఁగాఁ జాలఁ డనఁగఁ
    దత్ప్రభావంబు నెన్నంగ దరమె నాకు.49

టీ. రామ = పార్వతీ తారకపావనరామనామము = సంసారమును దరింపఁజేయగల (లేక, ఓంకారార్థమైన పవిత్రమగు రామనామము.) ఎంతపాపంబున్, అడఁగించున్ = పోఁగొట్టునో, అంతయఘమున్ = అంత పాపమును, శ్వపచుఁడు ఐననున్ = కుక్కమాంసము తినుచండాలుఁడైనను, (ఈజాతి మిక్కిలి యధిక మగుతమోగుణము గలది యగుటచేత నిట్లు చెప్పఁబడెను.) చేయఁగాచాలఁడు = చేయలేఁడు, అనఁగన్ = అని చెప్పుచుండఁగ, తత్ప్రభావంబు = ఆమంత్రముయొక్క సామర్థ్యమును, నాకున్ వర్ణింప తరము ఎ= నేను వర్ణింపఁగలనా ?

తా. ఓపార్వతీ! ఈరామనామమెంతపాపమును బోఁగొట్టఁగలదో అంతపాపమును జండాలుఁడు కూడఁ జేయలేఁడని చెప్పుదురు. ఇట్లుండ దీనిప్రభావమునుగూర్చి నే నే మని వర్ణింపఁగలను. అయినను నాశక్తికొలది కొంత వర్ణించి చెప్పెదను.