పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర థ మా శ్వా స ము.

65


అవ. రామనామము విష్ణువుయొక్క యవతారములలో నొక్కటి యగురామావతారమునుగూర్చి చెప్పునని లోకమునఁ బ్రసిద్ధి కలదు గదా, ఇది పరబ్రహ్మవాచకమే యని నిర్ణయించుట యెట్లు? అను సంశయము క్రిందిపద్యముతో నివారించు చున్నాఁడు:-

తే. రామపదవాచ్యుఁ డాదినారాయణుండె
    యతనికిని నాకు భేద మింతైనఁ గలుగ
    దద్వయబ్రహ్మమయుల మట్లగుటవలన
    నింతి నాయంద నేను రమింతు నెపుడు. 48

టీక. రామపదవాచ్యుఁడు = రామపదముచే చెప్పతగినవాడు, ఆదినారాయణుండు ఎ = అదిపురుషుఁడగు విష్ణువే, అగును. (విష్ణుమూర్తియవతారములలో నొక్క దానిని చెప్పునది యగుటచే నారామనామము విష్ణు వాచక మగు ననుటలో సంశయము లేదనుట.) ఆతనికిన్ = ఆ విష్ణువునకును, నాకున్, భేదము, ఇంతఐనన్ = కొంచెమైనను, కలుగదు = లేదు. అద్వయబ్రహ్మమయులము = మే మిరువురము కేవలపరబ్రహ్మరూపులము (అనఁగా: ఉపాధు లగుశరీరముకు వేఱువేఱుగా నున్నను, ఆశరీరములయం దున్న పరమాత్మునకు భేదము లేదు కావున మే మిరువురము నొక్కటియే. మఱియు ఈరామనామము విష్ణువును చెప్పునదియే యనినను విష్ణుశరీరోపాధియందున్న పరబ్రహ్మమునుగూర్చియే చెప్పును గాని దేహమునుగూర్చి చెప్పదుగదా ఈరామనామము మాత్రమే కాదు పేరైనను కేవలశరీరమును గూర్చి చెప్పు ననుట సంభవింపదు. నేను అనుశబ్దమునకు అర్థమగునట్టి జీవస్వరూపమే నీవు వాడు అను మొదలగు పదములకుఁ గూడ నర్థమగునని విచారణచే స్పష్ట మగుచుండుటచేత, లోకమునందలి యేపేరు గాని శరీరమును గూర్చి చెప్పుటయే సంభవింపదు. "ఇది శరీరము" అను మొదలగు స్థలముల యందు వ్యవహరింపఁబడుశరీరాదినామములుకూడ ఆయాభూతముల స్వరూపములతో నున్న పరబ్రహ్మమునే చెప్పవలయును. పరబ్రహ్మభిన్న మగువస్తువే లేదుగదా! కావున వాచ్యార్థము (ఫైఁకితోచునట్టియర్ధము.) విష్ణువే యైనను లక్ష్యార్థము (ఊహింప తగినయర్థము, లేక విచారణచే నిర్ణయింపఁదగినయర్థము) పరబ్రహ్మమే యగును. అట్లు అగుటవలనన్ , ఇంతి = ఓ పార్వతీ ! నేను, నాయంద = ఆత్మస్వరూపమునందే, {నలువదియయిదవ పద్యమున "రమియింతు రామునియందు” అని చెప్పఁబడియున్నది దాని కిది వ్యాఖ్యాన మని తెలుసుకొనవలయును.) ఎపుడున్, రమియింతున్ = క్రీడించెదను.

తా. ఓ పార్వతీ! ఈ రామనామము రామావతారమును గూర్చి చెప్పునది యగుటచే విష్ణువాచక మనుటలో సంశయము లేదు. అట్లైనను ఇది విష్ణుశరీరోపాధియం