పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

64

శ్రీ సీతారామాంజనేయసంవాదము

చెందినట్లు తలంపఁబడుచున్న పరబ్రహ్మనుగూర్చి, (అనఁగా : బ్రహ్మవిష్ణురుద్రేంద్రాది దేవతలనుగూర్చి) చెప్పును. ఈమంత్రమట్లు గాక పరమానందస్వరూపుఁడై జ్ఞానయోగుల కందఱకును, విశ్రామస్థాన మైనవా రందఱును ( క్రీడించు స్థాన మైన) శుద్ధపరబ్రహ్మమును గూర్చి చెప్పును. ఈ కారణమువలన సర్వకాలములయందును మిగుల ప్రీతితో నీమంత్ర ముపాసన చేయువారలకు ధర్మార్థకామమోక్షము లనియెడు నాలుగుపురుషార్థములును గలుగును.

అవ. ఇట్లు సామాన్యముగా మంత్రార్ధమును జెప్పి దానిని వివరించువాఁడై రామశబ్దము పరబ్రహ్మను జెప్పువిధమును నిరూపించుచున్నాడు.__

క. సత్యజ్ఞానానంద, ప్రత్యగ్భిన్నాత్మునందు బ్రహ్మాదిబుధుల్
   నిత్యము రమించుచుండఁగఁ, గాత్యాయని, రామపదము గలిగెఁ బరునకున్.

టీక. ఓ కాత్యాయని - ఓ, పార్వతీ సత్య ... నందున్ - సత్య= కాలమువలనఁగాని, దేశమువలనఁ గాని, వస్తువులవలనఁ గాని భేదముఁ జెందక (అనఁగా : సర్వకాలసర్వదేశ సర్వావస్థలయందు నొక్క రీతిగ నిలచి) సత్యమై యుండునట్టియు, జ్ఞాన = ఒక దానిచే తెలిసికొనఁబడక తా నన్నిటిని జూచుచు స్వయం ప్రకాశ స్వరూపముతో నుండునట్టియు, ఆనంద= ఏదుఃఖములతోను సంబంధము లేక పరమానందరూపుఁడై నట్టియు, ప్రత్యక్ష కూటస్థునికంటె (అనఁగా: ఘటాకాశమువలె శరీరోపాధియందున్న అభిన్నబ్రహ్మమునకం టె) జీవునికంటె, వేఱుకాని, ఆత్మునందున్ = పరమాత్మునియందు, బ్రహ్మాదిబుధుల్ = బ్రహ్మ మొదలగు దేవతలు, (లేక, జ్ఞానయోగులు,) నిత్యమున్ - సర్వకాలములయందును, రమించుచుండఁగన్ = క్రీడించుచుండఁగ ,(అనఁగా : జీవబ్రహ్మైక్యజ్ఞానముకలిగి యాఙ్ఞానముచే మోక్షరూప మగు పరమానందము ననుభవించుచుండుట చేత) పరునకున్ = ఆపరబ్రహ్మమునకు, రామపదము = రామనామము, (రమయతీతి రామః, రమంతే అస్మిన్ ఇతి రామః = రమింపజేయువాఁడు గాన రాముఁడు, లేక, యాతని యందు రమింతురు కావున రాముఁడు” అనువ్యుత్పత్తిచే, రామశబ్దము పరబ్రహ్మవాచక మగునని తెలిసికొనవలయును.) కలిగెన్ రామశబ్దముచే పరబ్రహ్మమును చెప్పుచున్నా రనుట.)

తా. ఓపార్వతీ! చతుర్ముఖుఁడు మొదలగుజ్ఞానయోగులందఱును, జీవాభిన్నుఁడగునాపరమాత్రునియందే సర్వావస్థలయందును క్రీడించుచుందురుగదా ! ఇట్లు సకల యోగులకును క్రీడాస్థాన మగుటవలన నాపరబ్రహ్మమునకు రామనామము కలిగెను. కావున రామనామమంత్రము శుద్ధపరబ్రహ్మమును బోధించునదియే యని నిశ్చయించుకొనవలయును.