పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ సీతారామాంజనేయసంవాదము


దును ఆపరమశివుని విడువక యాశ్రయించియేయుండునది యైనను అధికమగు భక్తిని అనురాగమును జూపుచు నాలుగువిధము లగు (అనఁగా: స్థానశిశ్రూష మొదలగు) శుశ్రూషలఁజేసి సేవించుచుఁ బూజ లొనర్చుచు, మనసున తదేకనిష్ఠతో ధ్యానము చేయుచు మ్రొక్కుచు, నామహాత్మునకు మిగుల సంతోషమును గలిగించెను. అప్పు డనుగ్రహదృష్టితో నాశంకరుండు పరమేశ్వరిం జూచి “నీకిష్ట మేమి ? ఇచ్చెదను - అడుగుము” అనుటము నద్దేవి యానందభరితాంతరంగయై చిఱునగ వొప్ప నీక్రింద జెప్పఁబోవువిధంబునఁ బ్రశ్న చేసెను.

ప్రమాణవివరము.

ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్దము, అర్థాపత్తి, అనుపలబ్ది అని వేదాంతు లంగీకరించు ప్రమాణములు ఆఱు. ప్రమాణమనఁగా: ఒక వస్తువుకల దని నిర్ధారణ చేయుటకుఁ దగిన యుపాయము. ఇందు. ప్రత్యక్ష మనఁగా: చెవి కన్ను మొదలగు నింద్రియములతో నేవస్తువునైనను తెలుసుకొనుట; అనుమాన మనఁగా: ఏది యైన గుఱుతునుబట్టి యిచ్చట నీ వస్తువుకలదని నిర్ణయించుట. పొగను జూచి యిచ్చట యగ్ని యున్నదని చెప్పుట; చల్లదనమును జూచి యావస్తువు పచ్చిది యని నిర్ణయించుట; ఉపమానమనగా; తానొకమాఱు చూచియున్న వస్తువును బట్టి, దానిని పోలియున్న మఱియొక వస్తువును గ్రహించుట; శబ్దమనగా ; ఆప్తు లగువారు, లేక, సర్వజ్ఞు లగువారు, చెప్పిన దానినిబట్టి వస్తుతత్త్వమును నిర్ణయించుకొనుట; అర్థాపత్తి అనగా : కారణమునకు విరుద్ధ మగు కార్యమును జూచి దానికిఁ దగిన కారణము నూహించుట; దేవదత్తుఁడు బలిసియున్నాడు గాని వాడు పగలు భోజనముసేయఁడు అను మొదలగు సందర్భములయందు భోజనము బొత్తిగా లేకయుండిన బలియుట సంభవింపదు గావున వాడు రాత్రి భోజనము చేసి తీరవలయును అని నిర్ణయించుకొనుట; అనుపలబ్ది అనఁగా: ఈవస్తువు లేదు గనుక కానరాలేదు. కావున నిచ్చట దానియభావ మున్నది యని యభావముల నిర్ణయించుట.

చతుర్విధశుశ్రూషా వివరణము.

౧. గురుని గృహారామక్షేత్ర పశుధనధాన్యాదులు రక్షించుట స్థానశుశ్రూష.

౨. దేశికునకు అభ్యంగనస్నానపాదసంవాహనాదులఁ జేయుట అంగశుశ్రూష.

౩. గురుఁడే తల్లి దండ్రి చుట్టము స్నేహితుఁడు విద్య ధనము దాత దైవము రక్షకుఁడని తలఁచుట భావశుశ్రూష.

౪. గురువున కిష్టములగు పదార్థము లడుగక మునుపే తుష్టిగఁ దెచ్చియిచ్చుట యాత్మశుశ్రూష.