పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42

శ్రీ సీతారామాంజనేయసంవాదము


కీలాసః = భూమియందును జలమునందును నివసించునది కీలాసము. అనఁగా; స్ఫటికము. తస్య అయం కైలాసం = ఆ స్ఫటికమునకు సుగంధించినది కైలాసము, స్ఫటికమయమైనది యనుట).

తా. ధర్మార్థకామమోక్షంబుల నొసంగఁ జాలు సత్త్వగుణము నాశ్రయించి, పరమశాంతులై యున్నమునులకు నివాసమై తన్నాశ్రయించినవారలకుఁ గల అహంకారము మమకారము డంబము మొదలగు సకలదుర్గుణముల నడంచును, పరబ్రహ్మమునుంబోలె కైలాస మనునొకపర్వతము మిగుల ప్రకాశించుచుండును. దానిపై పరమానందముతో పార్వతీపరమేశ్వరులు నివసించుచుందురు. (పైపద్యమునందు చిద్విలాసము అనుటచేత కైలాసపర్వతమును పరబ్రహ్మముతో పోల్చి యున్నాఁడు. కావున నీ పద్యమునందుఁ బరబ్రహ్మపరముగ రెండవ యర్థముకూడఁ గలదు. “కేళీనాం సమూహః కైలం" కేళి యనఁగా, నానందము వానియొక్క - సమూహము కైల మనఁబడును. 'కైలేన ఆస్యత ఇతి కైలాసః, కైలం ఆసో యస్యసః కైలాసః' కైలముచే నిలుచువాడు, కైలము ఉనికిగాఁ గలవాడు. ఆనందరూపుఁడనుట. ఈవ్యుత్పత్తిచే కైలాసపదము పరబ్రహ్మమునందు కూడ వర్తించును.)

బ్రహ్మపరమైన యర్థము.

టీక. శ్రీ = ధర్మార్థ కామములను సంపత్తును, సుఖ = పరమానందరూపమగు మోక్షమును, ద = (కర్మమార్గముచేతను, జ్ఞానమార్గముచేతను, తననుసేవించువారలకు) ఇచ్చునట్టి, శుద్ధసత్త్వ = రజోగుణములతోఁ గాని తమోగుణములతోఁగాని కొంచెమైనను సంబంధములేని , (లేక, తిరస్కరింపబడని పరిశుద్ధ మగుసత్త్వగుణమె స్వరూపముగా గలమాయకు) ఆవాసము = నివాస మైనట్టియు, (మాయకంటె వేఱుగాక తనను కర్మయోగముచే సేవించువారలకు ధర్మార్థకామములను, జ్ఞానయోగముచే సేవించువారలకు మోక్షమును ఇచ్చునట్టి అని భావము.) శివ = ఆనందస్వరూపుఁడగు, లేక, మంగళకరుడగు, పురుషునకును (జీవునకును), పార్వతి = మలినసత్త్వప్రధాన యగు నవిద్యకును, (జీవుఁడు బ్రహ్మమునకంటె వేఱుకాఁడు = అవిద్యయు మాయకంటె వేఱుకాదు. అగ్నికంటె దానియందున్న యుష్ణశక్తియు, యుష్ణశక్తికంటె నగ్నియు వేఱుకానట్లు పరబ్రహ్మమునకంటె మాయయు మాయకంటె పరబ్రహ్మంబును వేఱు కాదు కావున నిచ్చట "జీవుఁడును ఆవిద్యయును బ్రహ్మయం దున్నవి” అని చెప్పఁ బడియున్నది. పార్వతీశబ్దమునకు అవిద్యయని యర్థము చెప్పుట ఔపచారిక మని తెలిసికొనవలయును.) నివాసము, సుమహాభాసము = సూర్యుఁడు చంద్రుడు అగ్ని మొదలగువానిని ప్రకాశింపఁజేయఁజాలు తేజస్సు గలదియు, అనాభాసము = ఈశ్వరుఁడు జీవుఁడు ప్రపంచము అను మొదలగువికారము లేవియును లేనిదియు, అగు,