పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర థ మా శ్వా స ము.

101


అవ. ఈ క్రింది రెండు పద్యములచే రామతత్త్వస్వరూపవ్యాఖ్యానము నుపసంహ రించుచున్నాఁడు. —

ఉ. రాముఁడు నిర్వికారుఁడు నిరామయుఁ డవ్యయుఁ డక్షరుండు ని
    ష్కాముఁ డతీంద్రియుం డజుఁ డకర్త యభోక్త యసంగుఁ డంతరా
    రాముఁడు నిర్వికల్పుఁడు నిరంజనుఁ డద్వయుఁ డైనయాపరం
    ధాముఁడు గాని చారుగుణధాముఁడు గాఁడు సమీరనందనా! 79

టీక. సమీరనందనా- వాయుపుత్రుఁడ నగు నాంజనేయా ! రాముఁడు, నిర్వికారుఁడు =
వికారములు లేనివాఁడును, నిరామయుఁడు = శరీరము లేని వ్యాడగుటచే రోగములు లేని వాఁడును, ఆవ్యయుఁడు== నాశములేనివాఁడును, (లేక, స్త్రీ పురుషాదిలింగభేదములు లేని వాఁడును), అక్షరుండు=నశింపనివాఁడును, నిష్కాముఁడు = కోరఁదగినది లేనివాఁడును (పరమానందమె ఆయనకు స్వరూప మగుటచేతను జనులచేఁ గోరఁబడునదియు నానంద మే యగుటచేతను, పరబ్రహ్మము కోరవలసిన పదార్థ మేదియు నుండదని భావము.) అతీంద్రియుండు = ఇంద్రియములకు గోచరము కాని వాఁడును, అజుఁడు = ఉత్పత్తిలేనివాఁడును, అకర్త = యేకార్యమును జేయనివాఁడును, ఆభోక్త= ఏ ఫలమును అనుభవింపనివాఁడును, అసంగుఁడు=దేనితోను సంబంధపడనివాఁడును, అంతరారాముఁడు = సకలభూతములయందు అంతర్యామియై విహరించువాఁడును, నిర్వికల్పుఁడు = సంకల్పవికల్పములు లేనివాఁడును, నిరంజనుఁడు = మఱియొకదాని సహాయము లేకయే స్వయముగఁ బ్రకాశించువాఁడును, అద్వయుఁడు = తనకంటె వేఱగు పదార్థము లేని వాఁడును, అయిన = అయినట్టి, ఆపరంధాముఁడుగాని ఆ పరమాత్ముఁడేకాని, చారు ...గాఁడు - చారు = మనోహరములైన, గుణ = గుణములకు, ధాముఁడుగాఁడు = ఆధారభూతుఁడు కాఁడు. (అనఁగా: సగుణుఁడును శరీరవిశిష్టుఁడును కాఁడనుట. )

తా. ఓఆంజనేయా! వికారములు లేనివాఁడును, దేనితోను సంబంధము లేనివాఁడును, ఆద్వితీయుఁడును, శరీరము మొదలగునవి లేనివాఁ డగుటచే రోగములు మొదలగునవి లేనివాఁడును, కామక్రోధాదులు లేనివాఁడును, ఇంద్రియములకుఁ గోచరముకానివాఁడును, ఒక పనిని జేయుట గాని, దాని ఫలము ననుభవించుట గాని లేనివాఁడును, అంతర్యామి యగువాఁడును, జాతిభేదములు వినాశము లేనివాఁడును,
ప్రత్యక్షాదిప్రమాణములతో నక్కఱ లేకయే స్వయముగఁ బ్రకాశించువాఁడు నగు నాపరబ్రహ్మ మీరాముఁడు. లోకు లనుకొనునట్లు శరీరాదియుక్తుఁడు కాఁడు, అనితెలిసికొనుము.

క. మాయాగుణానుగతుఁ డై, పాయక నానావిధ ప్రపంచం బితఁడే
   చేయు నని తోఁచు నేమియుఁ, జేయఁ డసంగుం డకర్త సిద్ధము వత్సా.