పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

100

శ్రీ సీతారామాంజనేయసంవాదము


పట్టాభిషేకముఁ జేసికొనుటయు మొదలుగా గలకార్యంబులన్నియున్ , నాచేత
నాచరితంబులయ్యెన్ = నాచే నాచరింపఁబడినవి. అట్లగుచుండన్ = ఇట్లీకార్యముల
నన్నిటిని నేనే చేసియున్నను, నిర్వికారుండు = ఏవికారములను లేనివాఁడును,
అఖిలాత్మకుండు = సకల ప్రపంచరూపుఁడును, ఐన, ఈ రామునియందున్, అజ్ఞానులచేతన్ ,
ఆరోపింపఁబడుగావునన్ = ఆరోపణ చేయఁబడుచున్నది గాన (అనఁగా: ఈ కార్యములనన్నిటిని
రాముఁడే చేసె నని జ్ఞానశూన్యు లగువారు తలంచుచున్నారు గావునననుట.)

తా. నేను (మూల ప్రకృతి) చేయుకార్యముల నీ రామునియందు (పరబ్రహ్మము
నందు) నారోపించువిధమును వివరించెదను వినుము. ఈరామునకు పుట్టుక గాని
కామక్రోధాదులతో సంబంధము గాని లేదు. శత్రువులు గాని, మిత్రులు గాని లేరు.
హర్ష శోకములు లేవు. ఈవికారము లన్నియు నాచేఁ (జ్ఞానముచే) గల్పింపఁబడినవి.
ఇట్లున్నను అజ్ఞానులగువారు ఈ రాముఁడే రఘువంశమున జనించి, విశ్వామిత్రునకుఁ
దోడ్పడి యమ్మహాత్మునియజ్ఞమును గొనసాగించి, అహల్యాశాపమును దీర్చి శివునివిల్లు
విఱచి నన్ను బెండ్లియాడెననియు, పరశురాముని భంగపఱిచి యయోధ్యకుఁజేరి యచ్చట
కొంతకాల నుండి లక్ష్మణునితోను నాతోను గూడి దండకారణ్యమును బ్రవేశించె
సనియుఁ జెప్పుచున్నారు. అచ్చట విరాధుఁడు మొదలగు రాక్షసుల ననేకుల
సంహరించి, మునుల కభయ మిచ్చి, మాయచే బంగరులేడియై వచ్చిన మారీచుని
సంహరించెననియు , మరలి యాశ్రమమునకు వచ్చునప్పటికి, మాయామయ
మగురూపఘుతో నున్న నన్ను రావణుఁడుఁ గొనిపోవఁగా నాకై బహువిధముల
విలపించె ననియు, నన్ను వెదకుచు నరణ్యములఁ దిరిగి తిరిగి జటాయుకబంధులకు
మోక్ష మిచ్చి,శబరిచే పూజలఁ గొని, వారు చెప్పినచొప్పున సుగ్రీవునితో
మైత్రి జేసెననియు, భావించు చున్నారు. సుగ్రీవునకుఁ బ్రియంబుగా
వాలిని ద్రుంచి, వానర రాజ్యమును సంపాదించి యిచ్చి వాని సహాయము చే
నన్ను వెదకించి తెలిసికొని లంకాపురమును నిరోధించి రావణుని సంహరించి,
యారాక్షసరాజ్యమును విభీషణున కిచ్చెననియు, పుష్పకారూఢుడై నాతో
గూడి యయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుఁ డయ్యె ననియుఁ దలంచు చున్నారు.
ఈ కార్యముల నన్నిటిని నే నాచరించితిని గాని రాముఁ డాచరింపలేదు. ఇట్లైనను
భ్రాంతివలన నజ్ఞాను లగువారు నిర్వికారుడై సర్వమయుఁడై యున్న యీ రాముని
యందే వీని నెల్ల నారోపించు చున్నారు. పైన నిరూపింపఁ బడియున్నట్లు ఈతని
సాన్నిధ్యమువలన నే నీ కార్యముల నెల్ల నాచరించుచుండుట నెఱుంగ లేక యిట్లు
భ్రాంతి నొందుచున్నారు, కావున.