పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

96

శ్రీ సీతారామాంజనేయసంవాదము

పరబ్రహ్మమునకంటె వేఱనియు, ఆపరబ్రహ్మము దానిమూలమున ప్రపంచమును
సృజించుచున్నాడనియు, ఇట్టివాఁ డగుటచే నాబ్రహ్మము సవికారమే యనియు,
కర్త యనియుఁ జెప్పితీరవలయును. పరబ్రహ్మమునకుఁ గలశక్తియే ప్రకృతి యని
శ్రుతులు చెప్పుచున్నవిగదా' అనిన సమాధానముఁ జెప్పుచున్నాఁడు:-

క. అమలుఁ డగునితనిసాన్ని
   ధ్యమువలన సృజింతు జగ మతంద్రితనై యి
   ట్లమర జడులచేఁ డత్సృ
   ష్టము కల్పింపఁబడు నీయసంగునియందున్.77

టీక. అమలుఁడు = నిత్యసిద్ధుఁడు (నిర్వికారుఁడు.) అగునితనిసాన్నిధ్యమువలనన్ =
అయినయీపరబ్రహ్మము యొక్క సామీప్యమువలన (అనఁగా: ఈ రాముఁడు నా
సమీపమున నుండుటచేత) అతంద్రిత = ఏమఱుపాటులేనిదాననై, జగము = లోకము,
సృజింతున్ = సృష్టిచేయుచున్నాను, ఇట్లమరన్ = ఈవిధముగా, నుండఁగా, జడులచేన్ = అజ్ఞానులచేత, తత్సృష్టము = నాచేఁజేయుఁబడిన సృష్టి, ఈయసంగునియందున్ =
నిర్వికారుఁడగు (లేక, దేనితోసంబంధము లేని) యీ రామునియందు, కల్పింపబ
డున్ = ఆరోపింపఁబడును.

తా. ఇట్లాత్మ నిర్వికారుఁడైనను శ్రుతులయందుఁ గొన్నిచోట్లనాయనయే జగత్కర్తయని
చెప్పఁ బడి యున్నది. మూలప్రకృతికిని ఆ బ్రహ్మమునకును భేదము లేదని
యిదివఱకే నిరూపించి యున్నాను. పారమార్థికస్థితి యిదియే యైనను, వేదము జనుల
క్రమక్రముగ నుద్ధరించుతలంపుచే నారంభమున నట్లు చెప్పుచున్నది, తిమిరరోగము
గలఁవాఁ డొకచంద్రబింబమును రెండుగాను మూఁడుగాను చూచినట్లు లోకులును
తమభ్రాంతివలనఁ బరబ్రహ్మమునందు భేదమున్నట్లు తలంచుచున్నారు. వేదము
కూడ తత్త్వస్వరూపము దానికి సుఖముగ గోచరమగుటకై మొట్టమొదట వారవలంబించియున్న
భేదమునే యధారము చేసికొని యుపదేశించుచుఁ గ్రమక్రమముగ యుక్తులచే
దానిని నిరాకరించి పరమార్థతత్వమును మనసున నాటింపఁ బ్రయత్నించుచున్నది.
ఇంతియేకాని ఆశ్రుతికి భేదమును జెప్పుటయందుఁ దాత్పర్యము లేదు. ఒకని
కొకగొప్పవిషయము బోధింపవలయు ననిన మొట్టమొదట వారికిఁ గలజ్ఞానమును తలంపులను
గమనించి వానికిఁదగినట్లు బోధయొనర్చుచుఁ గ్రమక్రమముముగఁ జిత్తమును
బరిపక్వముఁ జేసియే కదా యావిషయము ముపదేశింపవలయును. ఇట్లు చేయక
యొక్కమాఱిట్టివిషయముల నుపదేశించినవారిమనను (శిష్యులమనను) దానిని సంపూర్ణముగ
గ్రహింపలేక, 'నాకు సర్వముఁదెలిసె నని యభిమానించుచు ముందున్నస్థితియందు
నిలువ నొల్లక యుభయభ్రష్టమై చెడిపోవు ననుటయు ప్రత్యక్షసిద్ధమే కదా. కావున