పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

92

శ్రీ సీతారామాంజనేయసంవాదము


గదియించి యెదుట నిలచియుండెను. ఇట్లు తన కంతటి మహా కార్యమును సాధించి
యు నేమియుఁ గోరకున్న సత్స్వభావుఁడగు నాహనుమంతుని మహాబుద్ధిమంతుని
నవలోకించి యాతని మనోరథము నూహించి దయారసము మఱియు నుప్పొంగ సీతా
దేవితో నిటనియె, 'దేవీ ఈతఁడు మనయెడల మిగుల భక్తికలవాఁడు. పరమభాగవతులలో శిరోరత్న ముంబోలువాఁడు. నాయథార్థ స్వరూపము నెఱుంగఁ దలంచుచున్నాఁడు.
కావున నీతనికి లోకోత్తరమగు నాయథార్థ స్వరూపము నెఱింగింపుము"
అని యిట్లు రామచంద్రుఁ డాజ్ఞాపింపఁగానే జగన్మోహిని యగునా సీతాదేవియు
బంగారమునకు సుగంధముఁ గలిగినట్లు సంతసించి యాయాంజనేయుని కెదురై
ముఖకమలంబున చిఱునగవు తళుకొత్త నిట్లని యుపదేశింప నారంభించెను.

-: సీత హనుమంతునకు దారకయోగంబు బోధించుట :-


మ. సుమతీ! రాముఁడు నిర్వికారము సదా శుద్ధంబు బుద్ధం బచిం...
    త్య మవాచ్యం బతులం బతీంద్రియము సత్తామాత్రమున్ స్వప్రకా...
    శము నిర్ద్వంద్వము నిర్వికల్ప మజమున్ సత్సంవిదానందరూ
    ప మమూ ర్తం బజరంబు కేవలపరబ్రహ్మంబు చింతింపఁగన్. 74

టీక. సుమతీ= ఓసూక్ష్మబుద్ధిగలహనుమంతుఁడా, చింతింపఁగన్ = బాగుగ,
విచారించినయెడల, రాముఁడు, నిర్వికారము = షడ్వికారములు లేనట్టియు, సదా =,
ఎల్లప్పుడు, శుద్ధంబు = దేనితోను సంబంధము లేక స్వచ్ఛమై యుండునట్టియు, బుద్ధంబు =
జ్ఞానస్వరూపమైనదియు, అచింత్యము = మనసుచే తలంపరానిదియు, ఆవాచ్యంబు
 = నోటిచే వచింపరానిదియు, అతులంబు = తనతో సమానమగు మఱియొకవస్తువు
లేనిదియు (లోకోత్తరమైనదియు), అతీంద్రియము= ఇంద్రియములకు గోచరము కానిదియు,
సత్తామాత్రమున్ = సర్వకాలములందును సర్వదేశములందును సర్వవస్తువులయం
దును ఒక్కటే విధముగ నుండుటయే స్వరూపముగాఁగలదియును (నిత్యమైనదియును)
స్వప్రకాశము = పరుని సహాయము లేక స్వతంత్రమై ప్రకాశించునదియు, (అనఁగా,
తెలిసికొనఁబడునదియు, పరబ్రహ్మమును దెలిసికొనువాఁడు మఱియొకఁడు లేఁడని
భావము) నిర్ద్వంద్వము = సుఖదుఃఖములు శీతోష్ణములు మొదలగుద్వంద్వములు ఒకటి
విడచిన మఱియొకటి పురుషుని నాశ్రయించియే యుండు స్వభావము గలగుణములు
లేనిదియు, వానిచే బాధింపఁబడనిదియు) నిర్వికల్పము - సంకల్ప వికల్పములు
లేనిదియును, అజమున్ = ఉత్పత్తి లేనిదియు, సత్సం... పఘు - సత్ = సత్యము, సంవిత్ =
జ్ఞానము, ఆనంద = ఆనందము, రూపము = స్వరూపముగాఁ గలదియు, అమూర్తంబు =
ఇంద్రియములకు గోచర మగునాకారము లేనిదియు, అజరంబు = ముదిమి లేనిదియునగు,