పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

86

శ్రీ సీతారామాంజనేయసంవాదము

రార్థముగను = దుష్టుల శిక్షించి శిష్టుల రక్షించి లోకమున కుపకారము చేయుటకై, శ్రీరామచంద్రుఁడు ఐ= రాముఁడను పేర దశరథునకుఁ పుత్రుఁడై, క్షితిపై = భూమి యందు , అవతరించి = పుట్టి, ప్రేమతో = అనురాగముతో, సీతను, పెండ్లియాడి= సాకేతపురమునన్ = అయోధ్యాపట్టణమునందు , సంభ్రమించుచున్ = సంతసించుచు, ఉండి = పండ్రెండుసంవత్సరము లుండి, (వివాహమైనపిదప రాముఁడు పండ్రెండుసం వత్సరములకు అరణ్యమునకు పోయె ననుట రామాయణమున ప్రసిద్ధము.) జగములన్ = ప్రపంచములను, రక్షింపన్ = రావణబాధలేకుండ రక్షించుటకును, జననివరమున్ = కైకకు దశరథుఁ డంతకు పూర్వమిచ్చియున్న వరములను , జనకునివాక్యమున్ = దశరధుని మాటను, (లేక, ప్రతిజ్ఞను,) సమకూర్చి చెల్లింపవ్ = సిద్ధించునట్లుచేయుటకును, తమ్ముఁడు = లక్ష్మణుఁడు, భార్యయున్ = సీతాదేవియును, తానున్ , కూడి, తాపసులవేషములు = ఋషులవేషములను (అనఁగా : నారచీరలు మొదలగువానిని,) తాల్చి = ధరించి, తాల్మి = ఓర్పు, మీరన్ = అతిశయించునట్లుగా, (అనఁగా : ఈవనవాసము చేయవలసి వచ్చేనే యని కొంచెమైనను విసిగికొనక) దండకారణ్యభూములన్ = దండకారణ్యమునందు, తగన్ = ఒప్పునట్లుగా , చరించి = తిరిగి, సకలరాక్షసగణములన్ = సమస్తరాక్షసులను, (అనఁగా విరాధఖరదూషణాదులను,) సంహరించి, (ఈ రాక్షసవధయె రావణు నకు రామునిపై క్రోధముకలిగించినది కావున నీ వధను చెప్పుటచే రావణసంహారమునకుఁ గారణము లగు సీతాపహారాదులను గూర్చి చెప్పినట్లె యని యూహించునది.) అంత మీఁదన్ = అటుతర్వాత (అనఁగా : సీత రావణుని యంతఃపురమున నున్న దని ఆంజ నేయువలన నెఱింగినపిదప, సీతానిమిత్తమై = సీతను గొనివచ్చుటకై, అరిగి = లంకకు జని.

తా. భక్తులతాపత్రయమును జల్లార్చుటయే ముఖ్య మగుకార్యముగాఁ గలిగి సంచరించు నామహావిష్ణువు దేవతలప్రార్థనమువలన రావణసంహారము చేసి లోకమున కుపకారము చేయుటకై రాముఁ డను పేర దశరథపుత్త్రుఁడై భూలోకమున జన్మించి, భూమికి పుత్త్రికయై సీత యను పేర జనకునియింటఁ బెరుగుచున్న లక్ష్మీదేవిని వివాహ మయ్యెను. ఆవివాహమున కనంతరము పండ్రెండు సంవత్సరములు సకలభోగముల నను భవించుచు నయోధ్యయందుండి తాను వచ్చిన పనిని (రావణసంహారమును) శీఘ్రముగు నిర్వహించు తలంపునఁ దనతండ్రి యగుదశరథుని ప్రతిజ్ఞను బరిపాలింపవలయు ననియుఁ దల్లికిచ్చినవరములఁ జెల్లింపవలయు ననియు మిషచే సీతాలక్ష్మణులతోఁ గూడి ఋషివేషము ధరించి దండకారణ్యమును బ్రవేశించెను. అచ్చట విరాథుఁడు ఖరదూషణాదులు మొదలగు రాక్షసుల ననేకుల సంహరించి యావృత్తాంతమువలనఁ గోపించిన రావణాసురుఁడు మాయచే సీతాదేవిని లంకకుఁ గొనిపోవ, సుగ్రీవసహాయమువలన నాయమను వెదకించి, హనుమంతునివలన లంకలో నాయమ యుండుట నెఱింగి యాలంకకు వాసరసైన్యసమేతుఁ డై చనియెను.