పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తనయథార్థస్వరూపము నెఱుంగ లేడు అజ్ఞానము ఆవరించి యుండుట చేత తాను సామాన్యుఁ డనియే తలంచెను గాని, పరమాత్మరూపు డని యెఱుంగడు. ఈకారణము వలననే ప్రతిస్థలమునం దుండును. రామునకు యథార్థస్వరూపము దెలియుటకై ఇతరులగు అగస్త్యుడు మొదలగువారే బోధించుచుండినట్లు ఆరామాయణమువలనఁ దెలియుచున్నది. మఱియు ఆరామునకు స్వయముగానే తనయథార్థస్వరూపము తెలిసియుండిన యెడల నిర్వికారుఁ డైన తాను సీతానిమిత్తమై దుఃఖించునా! ఆయనకు తన స్వరూపమె ఎప్పటికిని తెలియ దనిన సకలజీవులతో సమానుఁడే యగును గదా! అప్పు డాయన పరబ్రహ్మ మగుట ఎట్లు! కావున రాముఁడు పరబ్రహ్మమే యైనను అజ్ఞానావరణము కలిగియున్నా డనవలయును."

“ఓ పరమేశ్వరా ! ఈ రెంటియందును ఏది సత్యమో యని (అనఁగా: రామునకు మాయాగుణములతో సంబంధము కలదా లేదా? యని) నాకు సంశయముకలుగుచున్నది.ఈసంశయమును పోగొట్టుడు.” అని పార్వతీదేవి ప్రశ్న చేసెనని తెలిసికొనవలయును.

రామాయణకథాసంగ్రహము

ఆవ. పైన వర్ణించినవిధముగ శ్రీరామహృదయమును జెప్పెద నని ప్రతిజ్ఞ చేసి దాని కుపోద్ఘాతముగ రామాయణమును సంక్షేపముగా వర్ణించుచున్నాఁడు.

సీ. ఆదినారాయణుం డార్తరక్షణపరా
          యణుడు లోకోపకారార్థముగను
   శ్రీరామచంద్రుఁ డై క్షితిపై నవతరించి
          ప్రేమతో సీతను బెండ్లియాడి
   సాకేతపురమున సంభ్రమించుచు నుండి
          జగముల రక్షింప జననివరము
   జనకుని వాక్యంబు సమకూర్చి చెల్లింపఁ
         దమ్ముఁడు భార్యయుఁ దాను గూడి
తే. తాపసుల వేషములు దాల్చి తాల్మి మీఱ
   దండకారణ్య భూములఁ దగఁ జరించి,
   సకలరాక్షసగణముల సంహరించి
   యరిగి సీతానిమిత్తమై యంతమీఁద. 71

టీ. అర్త...నుడు ఆర్త = ఆధ్యాత్మికాదితాపత్రయము వలన బాధపడువారిని, రక్షణ = రక్షించుటయే, పర = శ్రేష్ఠమగు, అయనుఁడు = గతి(పని) గాగల, ఆదినారాయణుండు = సకల జగత్తులకు నాదికారణభూతుఁడగు మహావిష్ణువు లోకోపకా