పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

84

శ్రీ సీతారామాంజనేయసంవాదము


తా. పైఁ జెప్పిన విధముగ నాపరమేశ్వరుఁడు రామమంత్రము నుపదేశించి దాని సామర్థ్యము తెలుపఁగానే "లోకుల నుద్ధరించుటకు చక్కని యుపాయము దొరకెనుగదా అని మిగుల సంతసించి యాపార్వతీదేవి తన ప్రియుని గొనియాడి పలుమాఱు నమస్కరించి యిట్లనియె. "ఓ స్వామీ. మీరు మంత్రమును దాని ఫలమును దెలియఁ జేసితిరి; గానీ ఆమంత్రమునకు అధిదేవతయగు శ్రీరామునితత్త్వస్వరూపమును గూర్చి వివరింపలేదు. కావున దానిని వివరించి యనుగ్రహింపవలయును" అని వేఁడుకొనఁగానే, ఆపరమేశ్వరుఁడు మొదట కొంత సంశయించియు పార్వతీదేవి మిగులజ్ఞానవతి యగుట చేత శ్రీరామతత్త్వస్వరూపమును ప్రకటింప నిశ్చయించి ఇట్లనియె. “ఓ పార్వతీ! రామహృదయ మను నొక కథ గలదు. అది సాధారణముగ నందఱకును తెలియునది కాదు. అట్లయినను నీపు జ్ఞానసతివగుటచే, నీకు దాని వివరించి చెప్పెదను. అందు నీవడిగిన విషయమంతయు స్వష్టము కాగలదు." అని చెప్పి క్రింద రాఁబోవువిధముగ శ్రీరామహృదయమును జెప్పుట కారంభించెను.

పార్వతీసంశయవివరణము.

శ్రీరామునియధార్థస్వరూపమును గూర్చి పార్వతికి సంశయము కలదని యధ్యాత్మరామాయణమునం దున్నది.

“వదంతి రామం పర మేక మాద్యం, నిరస్తమాయాగుణసంప్రసారమ్,
 భజంతి చాహర్నిశ మప్రమత్తాః, పరం పదం యాంతి తధైవ సిద్దాః"

ఓపరమేశ్వరా! ఈ రాముఁడు అద్వితీయఁ డగు పరబ్రహ్మ మనియు, సకల జగత్తులకును కారణభూతుఁ డనియు, మాయతోఁ గాని దానిగుణము లగు సత్త్వరజస్తమస్సులతోఁగాని, సంబంధ మేమియును లేని పరిశుద్ధుఁడనియు చెప్పుచున్నారు. ఇంతమాత్రమేకాక నారామునిపై వర్ణింపఁబడిన స్వరూపముతోనే రేయుంబవ లొక్కరీతిగ మనసును రెండవదానిపైకిఁ బోనీయక సేవించుచున్నారు. ఆసేవయందు సిద్ది జెందినవారు పునరావృత్తిరహిత మగు మోక్షమును గూడఁ జెందుచున్నారు. ఇది భక్తజనులలో ప్రత్యక్ష మయియే యున్నది.

"వదంతి కేచిత్పరమో౽పి రామః, స్వావిద్యయా సంవృత మాత్మ సంజ్ఞం,
 జానాతి నాత్మాన మతః పరేణ, స బోధితో వేద పరాత్మతత్త్వం .
 యదిస్మ జానాతి కుతో విలాపః, సితాకృతే తేన కృతః పరేణ,
 జానాతి నైవం యది కేన దేవః, సమో౽పి సర్వైరపి జీవజాలైః."

ఇట్లున్నను మఱికొందఱు మఱియొక విధముగఁ జెప్పుచున్నారు. ఈరాముడు పరబ్రహ్మస్వరూపుఁ డగుటలో సంశయము లేదు; కాని అట్లయినను ఆయన తనయథార్థస్వరూపము నెఱుఁగ లేడు. అజ్ఞానము ఆవరించి యుండుటచేత తాను