పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర థ మా శ్వా స ము.

83


భక్తిపూర్వకంబుగా ననేక ప్రణామంబు లాచరించి వినుతించి స్వామీతన్మంత్రాధిష్టాన దేవతా శ్రీరామతత్త్వస్వరూపం బెట్టిది యెఱిఁగింపు మనిన నొక్కింత విచారించి శ్రీరామహృదయం బనుపరమేతిహాసంబు గల దందు శ్రీరామతత్త్వం బతివిస్పష్టంబుగా విలసిల్లు నది యతిరహస్యంబు గావున నెవ్వరికి గోచరంబు గాకుండు దాని నేఁ దెలియం జెప్పెద విను మని శ్రీమహాదేవుం డప్పార్వతీదేవి కిట్లనియె.

టీక. అని, ఇట్లు. శ్రీరామమంత్రంబును, తత్ప్రభావంబున్ = ఆరామమంత్రముయొక్క సామర్థ్యమును, ఉపదేశించినన్ = తెలియఁజేయఁగా, ఆకర్ణించి = వి ని, పర...యై - పరమ = అధికమగు, ఆనంద = సంతోషముచేత (అనఁగా : లోకులనుద్దరించుటకు చక్కనియుపాయము దొరకెను గదా యను సంతసము చేత ) భరిత = సంపూర్ణమైన, స్వాంత యై = మనస్సు కలది యై, అక్కాంతామణి = ఆ స్త్రీ రత్న మగు పార్వతీ దేవి, అత్యంతభ క్తిపూర్వకంబుగాన్ = అధికమగుభ క్తితో, అనేక ప్రణామంబులు = అనేక నమస్కారములను, ఆచరించి = చేసి, వినుతించి = స్తోత్రము చేసి, స్వామీ = ఓ ప్రభువా! త...పంబు తన్మంత్ర = ఆ శ్రీరామనామమంత్రమునకు, అధిష్టానదేవతా= దేవతయగు (అనఁగా : మంత్ర మెవ్వనిని గూర్చి జపింప వలయునో ఆ దేవతయగు ) శ్రీరామ = శ్రీరాముని యొక్క, తత్త్వస్వరూపంబు = యథార్థస్వరూపము. ఎట్టిది (రామునియథార్థస్వరూప మేమి?) ఎఱింగింపుము = తెలియఁజేయుము " అనినన్ = అని చెప్పఁగా, ఒక్కింత కొంచెము, విచారించి ఆలోచన చేసి, (అనఁగా: అతిరహస్య మగు నీ శ్రీ రామతత్త్వస్వరూపము నీయమకుఁ జెప్పవచ్చునా కూడదా?, అది చెప్పుట కీయమ తగినయధికారిణి యగునా కాదా ? అని కొంతవిచారించి, " శ్రీరామహృదయంబను = శ్రీరామహృదయ మను పేరు గల, పరమ...... ఇతిహాసంబు = శ్రేష్టమగునొక్క పూర్వకథ గలదు, అందున్ = ఆకథయందు, శ్రీరామతత్త్వంబు = శ్రీరాముని యథార్థస్వరూపము, (అనఁగా: ఆయథార్థస్వరూపమును గూర్చినవివరము), అతి విస్పష్టంబుగాన్ - మిగుల స్పష్టముగ, విలసిల్లున్ = ప్రకాశించుచుండును, అది = ఆకథ, (లేక, ఆ తత్త్వస్వరూపము) అతిరహస్యంబు= మిక్కిలి రహస్యమైనది. (అనఁగా : మిగుల నుత్తమములగునధికారులకుఁ గాని, చెప్పరానిది) కావునన్ = కాబట్టి, ఎవ్వరికిన్, గోచరంబు కాకన్ ఉండున్ = తెలియకుండును -(అనఁగా; దాని నెవ్వరు నెఱుంగరు.) దాని = =ఆతత్త్వస్వరూపమును (లేక కథను ,) ఏన్ = నేను, తెలియన్ చెప్పెదన్ = బాగుగ బోధపడునట్లుగా నీకు చెప్పెదను, వినుము” అని, శ్రీ మహాదేవుండు = శోభాయుక్తుఁ డగు నాయీశ్వరుఁడు, పార్వతీదేవికిన్ , ఇట్లు = ఈ క్రింద రాఁబోవు విధముగ, అనియెన్ - చెప్పెను.