పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మంచె యెక్కి రాజసమున మరలఁ బిలుచు
వచ్చిరేనియు దిగివచ్చి వారిఁ ద్రోలు. 171

క. ఇవ్విధమునఁ జని మగుడుచు
నవ్విప్రుని వెఱ్ఱీ యనుచు నందఱుఁ దమలో
నవ్వుచుఁ గనుకనిఁ బోవఁగ
నవ్వార్త యెఱింగి భోజుఁ డట కరుదెంచెన్. 172

క. వచ్చిన నృపు భటులం గని
యచ్చటఁ దనమంచె నున్న యాతఁడు చేలో
మెచ్చయినవి భక్షింపుఁడు
విచ్చలవిడి విడియుఁ డనిన విడిసిరి వారల్. 173

ఉ. తొల్లిఁటి యట్లతండు డిగి దూఱుచు భోజునిఁ జేరి యక్కటా
యిల్లొక సర్పమై తినిన నిష్ఠుఁడు వైరికి సత్తు విచ్చినం
దల్లి విషంబు వెట్టినను దండ్రి తనూజుల నమ్మినన్ మహీ
వల్లభుఁ డొల్చుకొన్న మఱి వారల కెవ్వరు దిక్కు భూవరా! 174

క. బలహీనులకును నృపతియ
బలమనఁగాఁ బేదఁ జెఱుపఁ బాడియె యిది నీ
బలములచేఁ బొలియించితి
వెలుఁగే తనచేను మేయు విధ మిటనయ్యెన్. 175

క. గతి గానక యిది యొక సం
గతి బ్రదికెద మంచు నుండఁగా ధర్మముఁ ద
ప్పితి "బ్రహ్మస్వం విషము
చ్యతే" యనుచుఁ బెద్ద లెల్లఁ జదువుట వినవే. 176