పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క. బలవంతుల మని విప్రుల[1]
ఫలభోగంబులకు నాసపడుదురె మును వి
ప్రులకిచ్చిన భూములు దము
చెలియండ్రని తలఁపవలదె క్షితిపాలురకున్. 177

ఆ. అనుడు విభుఁడు చోద్య మంది తా నమ్మంచె
యెక్కి తుష్టపుష్టిఁ జొక్కి తలఁచె
దాన ధర్మగతులు దప్పక రాజునై
దీనజనుల సిరులఁ దేల్పఁ దగదె. 178

క. వెడఁగు లగుజనుల వృద్ధుల
బడుగులనుం బ్రోవలేని బ్రదుకొక బ్రదుకే
యడిగెడు వారలు గలిగినఁ
బుడమంతయు నిచ్చి వారిఁ బుచ్చెద వేడ్కన్. 179

చ. అనుచు ముదంబునం బలికి యంతటఁ దానె యెఱింగి పల్లటి
ల్లిన హృదయంబు నిల్పికొని లెస్సనిధానము గల్గఁబోలు వి
ప్రుని గుణ మిట్లు గా దిచట భూమిగుణంబని నిశ్చయించి యొ
య్యన దిగివచ్చి యెంత కొలు చయ్యెడు బ్రాహ్మఁడ! చెప్పు నావుడున్. 180

శా. నాకుం జూడఁగ నూఱు పుట్లగు నరేంద్రా! విష్ణురూపంబవౌ
నీకుంజూడఁగ నెన్ని పుట్టులగునో నీవే కటాక్షింవ న
స్తోకంబౌ సిరి గల్గదే యనిన సంతోషించి వేయిచ్చి మం
చాకీర్ణంబగు పుట్టఁగూల్చి యొక నిల్వాక్రిందఁ ద్రవ్వించినన్. 181

-:

భోజరాజు సింహాసనమును త్రవ్వితీయించుట


క. భోజదృగంభోజగ్రహ
రాజాకృతి నురగరాజ రాజితచూడా

  1. పైబడి