పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

vii


ననియు, అతడు శ్రీనాథునకు గురు వనియు వ్రాసిరి.[1] శ్రీనాథుడు హరవిలాస పీఠికలో కృతిభర్త అవచితిప్పయసెట్టి గురువైన “పిల్లలమఱ్ఱి మహా ప్రధాని పెద్దన్న గురూత్తముడని, శైవమార్గ సంపన్ను"డని చెప్పెను. ఆ పెద్దన్నయే పెదవీరరాజని, కవియైయుండెనని, పినవీరభద్రుని అన్నయని చెప్పుటకు ఆధారములేదు. గోపరాజు పిల్లలమఱ్ఱి వీరరాజాదులను 'దలఁతు మత్కులచంద్రుల సత్కవీంద్రుల౯' అన్నాడు. బహుశః ఆ పెద్దన్న పినవీరభద్రునకు పితామహుడేమో!

ఈ సందర్భమున మరొక విషయము గమనింపదగియున్నది. ఈ కావ్యమునందలి అయిదవ ఆశ్వాసమున పదవ బొమ్మకథలో ఒక అవధూత విక్రమార్కునకు యోగరహస్యములు తెలుపు ఘట్టమున ఒక ఆటవెలది పద్యమును వ్రాసెను.

“దుఃఖసాధ్యమయ్యుఁ దొడరి యభ్యాసంబుఁ
 జేయఁ జేయ యోగసిద్ధి పెంపు
 దినఁగఁదినఁగ వేము తియ్యనౌ కైవడిఁ
 బిదప పరమ హర్ష పదము సుమ్ము . (5-15)

 ఈ పద్యము చదువగనే వేమన పద్యము .

“అనఁగ ననఁగ రాగమతిశయిల్లుచు నుండు” అనునది వెంటనే స్ఫురణకు వచ్చును. గోపరాజు తనకావ్యమున ఆటవెలది పద్యములను విశేషముగా వ్రాసినాడు. దీనినిబట్టి గోపరాజు వేమనకు తరువాత ఉండి అతని ప్రభావమునకు లోనై యుండెనా అని తలచుటకు అవకాశమున్నది.

1500-1530 ప్రాంతము కృష్ణరాయలు అష్ట దిగ్గజముల కాలము. గోపరాజు ఆకాలమున నుండినట్లు అతని కావ్యములో ఎట్టి సూచనయు లేదు.

  1. వాఙ్మయ వ్యాస మంజరి.