పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

viii


సింహాసన ద్వాత్రింశికలో దక్షిణదేశము నందలి ఎన్నో పుణ్య క్షేత్రముల ప్రస్తావన ఉన్నది. కాని పంపా విరూపాక్షము ప్రస్తావించబడలేదు. ఏమి కారణమో తెలియదు. ఇంతవరకు తెలిసిన దానిని బట్టి గోపరాజు పిల్లలమఱ్ఱి పినవీరభద్రునకు ఈవలి వాడని మాత్రము చెప్పవచ్చును.

గోపరాజు వైద్యుష్యము : గోపరాజు తన్ను గూర్చి తన కవితానైపుణ్యమును గూర్చి కావ్యావతారికలో నిట్లు వ్రాసికొన్నాడు.

“కం. పూజితులగు కవుల కృప౯
     భ్రాజిష్ణుఁడఁ గొంత అష్టభాషావిదుఁడ౯" (1-58)

వ. అని యిట్లు సకల వరప్రదాన కారణదేవతలను, జతుర హృద్యానపద్య గద్య పద్య విద్యా విద్యోతితులయిన కవీశ్వరులనుం బ్రశంసించి తత్ప్రసాదా సాదిత సహజ సాహిత్య తరంగితాంతరంగుండనై సకలజన సాధారణంబగునట్లు విన్నవించెద. (1-13)

కం. అప్పరమేశ్వరు కరుణం
    గుప్పలుగొను విక్రమార్కు గుణముల కొఱకై
    చెప్పెద రసభావంబులు
    ముప్పిరి గొనునట్లు కథలు ముప్పడి రెండు౯. (1-31)

ఆ.వె. తన వచోవిశేష మెనయక పూర్వక
      థామితోక్తిఁ జెప్పుటేమి కడిది
      యొకఁడు గోలవట్టి యొయ్యనఁ గొనిపోవ
      నంధుఁడెచటికైన నరుగుటరుదె. (1-34)

ఈ విధముగ గోపరాజు తన రచనా విధానమును చెప్పెను కాని ఆనుకున్నట్లు ప్రతిభను ప్రదర్శింపలేక పోయినాడు. మూలమును యథాతథముగ చెప్పనని తన వచోవిశేషమును చూపెదనని చెప్పినట్లే చేసినాడు.