పుట:సారంగధరచరిత్రము (సముఖము వేంకటకృష్ణప్పనాయకుఁడు).pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

'వెఱ్ఱిబుద్ధులు నీ కేలవచ్చె? యిట్టి పాపంబు నాకేల గట్టెదవు? యిందున, శాశ్వతంబైన యపకీర్తి వచ్చుఁ, బరలోకంబున దండధరుని దండన లోర్వం దరంబుగాదు; సీతాలతాంగివంటి రత్నాంగికిఁ జనియించిన తన కిట్టిగుణంబులు రానేర్చునే? భూమీశ్వరునాన, యీతలంపులు మానుము, పదివేలు బలుకనేల, నా హృదయశుద్ధి పరమేశ్వరుం డొక్కరుండె యెఱుంగు' ననుటయు, నయ్యలివేణియు నెలనవ్వు మొగంబునం బొలయ, “నిజంబు పలికితివి. నీవు పతివ్రత కొడుకవు. నీ గుణంబులు నీవె పొగడకొనవలదు, హృదయంబుంగంటి: నే తల్లింగాను, దైవంబునుంగాను, మీరాజునకు భోగస్త్రీని; మదనవేదనాదోదూయమానహృదయ లైనసుదతులకు, వావు లేటికి? ధర్మంబు లేటికి? తగవు లేటికి? నా కన్ను లాన, నిన్నుం గూడకమాన, తక్కుపలుకులు విడువుము, పెక్కు లేమిటికి నిమిషంబు నిన్నుం గలసినం జాలు' నని యంతకంతకు నగ్గలంబైన తళుకంబునం బెగ్గిలి, తలుపు మూయంబోవు నప్పువ్వుబోణిం జూచి, 'నేను భోగస్త్రీని, వావులు నాకుఁ బనిలేదంటివి. వంశంబున కెల్ల యొక్కఁడేయని యొట్టిడిన పిన్నవాడే వేఱుపోయితి నన్నం దీరునే? యీ యవివేకంబున కేనందు? ఎందేని యీవావి జగమందుఁ గలదె? రత్నాంగి యొకటియు, నీ వొకటియుఁ గాదు: తలంచిచూడుము. పదరకుము, కాయంబు బుద్బుదప్రాయంబు ... ... యకృత్యంబులు చేయంబూనకుము, నిన్ను విభుం డఱచేతినిమ్మపండుగతి నత్యాస క్తితో లాలింప, నిలింపసంపద లనుభవింపుచు, సొంపున నుండునట్టి నీవు కావరంబునం గన్ను గానక నేల త్రుళ్లెదవు? ఇందున నాపత్పరంపరలు సిద్ధం' బనుటయు, నత్తరళాక్షి కటాంచలంబుల నొక్కించుక యంకురించిన యలుక సానఁదీఱిన చెఱుకువిలుతుని వాడితూపులం బోని మిటారిచూపులం జూచి, 'యోరీ! యెన్ని నేర్చినావురా! యిందున కొంతమోసంబునుఁ గలుఁగఁజేసి, జముం డనువాఁ డొక్కరుండు గలండని భయంబున దుద్దు పెట్టి పోవందలంచెదు. రాజయ్యీని, రెడ్జయ్యీని! ఆనాఁటికిం జూచుకొందము భూవల్లభుం డీకల్లఁ దెలిసి దండించిన దండించనిమ్ము. ఎక్కడి వావి, యెక్కడి పాపము? వెలకొమ్మ లెవ్వరిసొమ్ము? వలచివచ్చిన జవరాలిని విరాలిం బెట్టవలవదు.