పుట:సారంగధరచరిత్రము (సముఖము వేంకటకృష్ణప్పనాయకుఁడు).pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రతీదేవి పూవిలుతునకు వలచిరాదో, రంభ నలకూబరునకు మేలుఁ జెందదో, యీ వలపు తలంపు నాయెడనే బుట్టెనే? దారుకావని మౌనిమానినులకుం దగిలెఁగాని నీవలె నీలకంఠుండు నేరఁడయ్యెనో, గురునియిల్లాలిని రమించెంగాని కలువలచెలికాఁడు నీవలె నేరఁడయ్యెనో, యహల్యాకాంత నంటుకొనియెంగాని నీవలె నింద్రుండు నేరండయ్యెనో? వారికన్న నీకు వివేకం బధికంబు గాఁబోలు! నీకుఁ గలిగిన బుద్ధి వారికి లేదయ్యెనో? ఆనాఁటికి నీ వుంటివేని వారల యోజనలు జెఱుపవే' యనిన విని యా సుజనుండు, 'యీ పెడమాట లేమిటికి? సృష్టిస్థితిసంహారకర్తలైన దేవత లెటు వర్తిల్లినం జెల్లుగాని, తక్కినవారలకుం జెల్లునే? రంభ మొదలైన వెలయాండ్రు సైతము నిట్లు పుత్రులం బట్టిరే? మననేరవు: ఒక్కకార్యంబునుఁ గననేరవు, యెంత చెప్పిన విననేరవు: చాలుఁజాలు, విడువిడు, పోవలయు' నని బలికిన, నక్కలికి కలిబోసి వెనుక నుట్టిఁ గనుంగొనిన చందంబున నాశకుం బారంబు లేదు గావున నక్కుమారతిలకునిం దిలకించి 'యోరీ! ఱాయైనఁ గఱంగుఁ గాని నీమనంబు గఱుంగదయ్యె. ఇది నీకు మంచి దటరా? ఆఁడది యుసురుమంటే మోసంబు గాఁదటరా? నే బలికినపలుకుల కలుకచే గనుఁగొనలఁ గెంపు నించెదవు, యాకెంపు నాకెమ్మోవిపై నుంచితే దోసమా? నామనంబునం గోళ్లునిలిపెద, వది నా గబ్బిగుబ్బల నిలుపమంటే దోసమా, కుమారకా! వెన్నెలకాఁకకు, మందమలయానిలమ్ముల రాకకు, చిలుకలమూఁకకు, కోయిలల వీఁకకు, వసంతుని జోకకు, మదనుని ఢాకకు, నేకరణిఁ దాళుకొనుదానరా, కెమ్మోవి యానరా, నీకు మరునానరా, కౌఁగిలిఁ గరుణింపరా, యించుక చల్లనిచూపు నింపరా, నామనవి యాలింపరా!'

—అంచు నత్యంతం బుప్పతిలి కనుఁగొలఁకులఁ గాటుకకన్నీరు మున్నీరువలె వెడలి చనుగొండ మునుంగసేయఁ బెక్కువిధంబుల వేఁడుకొను నప్పల్లవాధరిమాటలు విననొల్లక యాచకులం జూచిన లోభివానిచందంబున వేఱెపరాకుం జూచుచు, నేమనిన నేమి వచ్చునో యని నోరెత్త వెఱచి యూడఁబాఱు నుపాయంబు జింతింపుచు, కొంతతడవుండి యటు నిటుఁ జూచి 'యా చెలిం బట్టిన వలరాభూతంబు కొంచాన విడువదు;