పుట:సారంగధరచరిత్రము (సముఖము వేంకటకృష్ణప్పనాయకుఁడు).pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యెప్పగిదినేనిం దప్పించుకొనిపోవుట యెప్పు' నని యప్పడంతుక పట్టినదుప్పటి విడచి సాముసేసిన యరమట్టి దట్టిచల్లడంబులతో వెలువడి, పులిచే విడువబడిన లేడివడువున రాహుదంష్ట్రావిముక్తుండునైన చందురునిచాడ్పునఁ బోవునెడ, ‘నోరీ! రసికుండవని యుంటి; పైదుప్పటి విడచి పోయెదవు, నీ యంగులెల్లం గంటి మారుబారికి వెఱచి నేను కోరినయెడ చీరికింగొనక, నోరికిందగని క్రూరంబులు పలికి జారిపోయెదు, వలదురా దురాత్మకా! యేల జెడిపోయెదురా? వలదురా, లోపంబులు నారోపించి భూపాలునకుఁ గోపంబు దీపింపఁజేసి నీ కీలుఁగీలుఁ గోయింతు, యింతులతోనా యింతలేసి రంతులు? నీ గురుతు నా చెంతఁ జిక్కె, మంచిది పొమ్ము పొమ్మని ఱొమ్ముఁ దాటింపుచుం బగఁజాటు నవ్వధూటిం దిరిగిచూచి సుగుణాకరుండైన రాకుమారుం 'డంబా! నీవు కుసుమాంబకుని యంబకంబులకునోడి పొడివీడి యాడి గెలకు నన్నుం బాలు సేయుట తగవుగాదు నీవు బలుకు భయంకరభాషణంబులకు వెఱచి, నీ మనోరథంబు నెరవేర్చం బూనితేని, లోకంబున నపకీర్తియుఁ, బరలోకంబున యమునిచే నార్తియుం బొంది పెక్కుజన్మంబుల హీనజాతులం బుట్టవలయు. అంత బాధ పడుటకంటె రాజుచేత నాజ్ఞపడుటేనియు మేలు; వసుమతీపతి చిత్తంబు వకావకలై నన్నుందెగఁజూచునట్లుగా విపరీతంపుమాటలు పలికెదనంటివి. ‘వినాశకాలె విపరీతబుద్ధి' యనువితంబున నీకు బుద్ధి పొడమె. నీ వచించినసుద్దులే నిజంబని తండ్రి నాపయిం గోపించి యాజ్ఞసేయించెనేనియు నాకాశవాణియు, భూకాంతయు నెఱుంగరే? ఆకొల నిన్నుం దోడనె చుట్చుకొను, నీకు సరిపోయినట్టు లుండుము; పోయివచ్చెద' నని పలికి యా గురుకుచనగరు వెడలి, సారథి తెచ్చి నిలిపిన కనకమణిమయరధంబును, మావంతుండు దెచ్చిన భద్రదంతావళంబును, పడివాగెఁ జేసిన కాంభోజకాశ్వరాజంబును, శిబికావహులు దెచ్చిన బంగరుపల్లకియుం జూడక, యూడిగంబులు దెచ్చి పాదంబులఁ బూన్చిన రవలపావలు మెట్టకయే, చింతాకాంతహృదంతరుండై, దిక్కులు చూడకయె తననగరికిం జనియె... [సశేషము.]