పుట:సారంగధరచరిత్రము (సముఖము వేంకటకృష్ణప్పనాయకుఁడు).pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిల్చి, యా గట్టువాయింతి, బలిమిం బట్టఁ బోవుటయు, నతం డవ్వాలుఁగంటిం గనుంగొని, 'నీకు నాయాన... అంటకు' మనిన, 'నోయి, మనోహరాంగ! నే నంటుఁబడినదానను గాను; నిన్నంటిన నేమి?' యనుటయు 'నో యమ్మా! యటంటఁ గాదు. మదీయజనకుం డంటిన పిమ్మట నిన్నంటఁ దగ'దనుటయు, 'నంటుమీఱి నిన్నంటకుండిన, మేనంబ్రాణంబులు గెంటక నెటులుండు? మేలుమేలు! నా మేలు దీటు సేయక నేలు, మేలా జాల, మేలా జాలి బెట్టుట?' యని, దీనత్వంబు దోపఁ బలుకుడు, వింతవింతచెయ్వులం గులుకుచుఁ, గీ లెడలించిన జంత్రంపుబొమ్మ కైవడి, నాతని యురంబున వాలి మోహాంబుధిం దేలి, కెమ్మోవిం గ్రోలం గమకించుటయు, 'హా మహాదేవ!' యనుచు, నా గజగామిని రెండుభుజంబులు రెండుచేతులం బట్టి తోయం బోవు నప్పు డవ్వనిత, మణికంకణంబు మెఱయ, నా రాచపట్టి హొంబట్టుదుప్పటిఁ జుట్టిపట్టుకొని, కూర్చుండఁ బెట్టి, ‘నను కన్నులవిలుమన్నీని బన్నంబుల పాలు చేసి కదలఁ జూచిన న్మెదలనిత్తునే? నా కన్నుల కఱవుం దీర్చిన నీమేను కౌఁగిటఁ జేర్చుకొనకయే, వీనులు తేనియలుఁ జిలుకఁ బలుకు నీ నోటికి బహుమానంబుగా నా తియ్యవాతెఱ విందు సెయ్యకయే, కప్పురంపువాసనలం గుప్పు నీ కమ్మకెమ్మోవికి సమ్మానంబుగా నే ముద్దాడకయే, నామనోభావంబుఁ గఱంచు నీదు హావభావంబులకు మెచ్చుఁగా నీవి నియ్యకయే, నిన్నుం బోవనిత్తునే రమ్ము రమ్ము: వేగిరమ్ము మానుము, కులుకుకోకిల నణంచు గళరవంబుపలుకులుసౌరు మొలనూలి గంటలనాదులు వినక నీకుఁ బోవందగ' దను మాటల వాడిశూలంబులు, చెవులలో నాటం దిమ్మువట్టి సొమ్మసిలి, క్రమ్మఱం దెలిసి, యమ్మంత్రినందను వాక్యంబులు నిక్కంబు లయ్యెనని విన్నంబోయి, కన్నీరుగార బెదవులు దడుపుచు, పులుకు పులుకునం జూచి, పలుకుపలునకుం దైన్యంబు దొలుక, “నేఁ జెల్ల, సతీమతల్లీ! నీవు పినతల్లివని వచ్చినందుల కెట్టిఫలంబు గలిగె, నెదుటివారి యుల్లం బెఱుంగక నీమాటలాడ నెట్టు నో రాడె? యేల తల్లడిల్లెదవు; నీవు తల్లివి నేను తనూజుండ, తల్లియుం దైవసమానంబు, అదియునుం గాక, యొరులచేడియలు నాకుం దోఁట్టువులు! యీ