పుట:సారంగధరచరిత్రము (సముఖము వేంకటకృష్ణప్పనాయకుఁడు).pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తిలకంబుఁ బెట్టుకొనుము, యీమల్లికాగంధం బలందుకొనుము, యీభోగతరంబులైన రతనంబుల భూషణంబులు నలంకరించుకొనుము, యీయమూల్యదుకూలంబులు ధరింపు' మని, యాఱాఁగ యొసంగరాగా, సారోదాత్తుండును, ధౌతభావంబున నవి యొల్లక తల్పంబునం బెట్టి, 'తల్లియుఁ దండ్రియుఁ గూఢబెట్టిన ధనంబులన్నియుఁ గుమారు లవి గా కెవ్వరివి గానోపు వచ్చికొనిపోయెద, నిది నాసొమ్ముగా నీయింట నుండనిమ్ము; అని ప్రియంబు గడలుకొనం బలికిన నాచిలుకలకొలికి తనహావభావవిలాసంబుల జాణతనంపుమాటల, నమ్మేటి మానసంబు గోరంత యేనిఁ జలింపంజేయఁజాలక, యూరట లేని యారాటము మల్లడిఁగొను నుల్లంబున, 'నక్కటా! యేమి సేయుదు: చట్టు పిళ్లారికిఁ జక్కిలిగింత లిడిన చందంబున నీతని చిత్తంబు మెత్తనఁ బడదు. దాదాపులకు వచ్చిన తాలిమి చెల్లునే? తాళిన మీనకేతనుండు ఘాతకుండు; యింక నేమిటం గుట్టు; సముఖంబున రాయబార మేమిటికి?' యని యూహించి, నెగ్గుసిగ్గులనుఁ బరిత్యజించి, యేకాంతంబుగా నలుదిక్కులుఁ గాంచి, పయ్యెక తొలంగ మీటిన పక్కున విచ్చు చన్నుంగవ బైటపడ, నీవీబంధం బూడ, పొక్కిలి చక్కఁదనంబు మిక్కిలి గనంబడ, కామాంధకారంబు గప్పుటం జేసి కన్నుఁ గానక, యగ్గంధగజగామిని, బాహుమూలంబులు తళుకు తళుక్కనన్, సందిట దండలు కంకణంబులు రవలగాజులు ఘల్లు ఘల్లు మన, కరంబుల సాచి కౌఁగలింపఁజూచుటయు, నయ్యుత్తమపురుషుండు, పాపభయంబున గడగడ వడఁకుచు 'హరహర! యిది యేమిగొడవ వచ్చె!' ననుచు దిగ్గున లేచి, 'తల్లీ! నే వచ్చి తడవాయె, పోయివచ్చెద' ననుటయు, నా గరిత, 'యోయీ, రూపరేఖావసంత! కాసంతయు దయలేదే ఆత్మజాకారంబున నావేడుకం జెల్లింతువంటివి. 'సత్యవాణీ సరస్వతీ' యటన్నవాక్య మేమిటికిందప్పు? ఆత్మజుండను పేరు మన్మథునకుం గలదు. నీవును దదాకారంబున రతులందేల్పుము. ఏమిటిమాట, మరునకు మోమాటమి లేదు? అని పలుకుచు, నడుము జవ్వాడ, కుచకుంభంబుల తారహారము లసియాడ పులకాంకురంబులు 'మేనంగూడ, తాల్మియూడ, వాలుగడాలుమన్నీఁడు పైయాడ, నింపుఁ గొనియు నోడక, వాఁకిటి కడ్డంబు