పుట:సారంగధరచరిత్రము (సముఖము వేంకటకృష్ణప్పనాయకుఁడు).pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెక్కడంపుటోవరులకప్పులు చవుకట్లుచప్పున నొప్పుమీఱ, మగరాలనిగరాలనెలకట్టుచాయలు వెన్నెలల వెదఁజల్లు మువ్వెలుంగులకు ఠావైన యారెలు, పరిమెళదట్టంబులైన గందపట్టియలు, త్రాణమీఱ మేళవించిన వీణియలును, గాలి సోఁకినఁ బలుకు కిన్నెరియలును, తేనియలం జిలుకు బలుకు చిలుకలును, నలువంకల నలంకరించిన గోరువంకలును, చక్కెరవిలుమాష్టీని ఢక్కల వలెఁ జెలంగు నంగులుఁ గల్గి, సకలశృంగారసంపదలసదనంబైన యాసదనంబున నొక్కమణిమయవేది నక్కుమారుం గూర్చుండ నునిచి, యెక్కడఁ జూచినం గొక్కోకకళారహస్యంబులైన చౌశీతిబంధంబులం బెనంగు గంధర్వకామినులను గంధర్వులను వ్రాసిన చిత్రపటంబులం జూపుచు, 'నోయీ, నెఱజాణ! యీ చక్కి నొక్కించుక చూడుము: గొల్లాయిల్లాండ్ర చనుగుబ్బలఁ బట్టి, వారి కెమ్మోవులఁ బలుమొనలుఁ బెట్టి యనురాగంబున భోగించు గోపాలుని చందంబు యెట్టులున్న' దనవుఁడు, నవ్విరక్తుండు నవ్వి!

'ద్రోణపుత్రుని బాణాగ్నిచేత దగ్ధంబై పడిన పరీక్షితుని, తనయఖండితబ్రహ్మచర్యవ్రతమహత్వంబునఁ బ్రతికించిన మహానుభావునకు నా విహారంబులు లోకవిడంబనంబు లింతియకాని సహజంబులు గాదు.'

'రాకుమారచంద్రా! చంద్రశేఖరుండు దారుకావనంబునఁ దపసిచపలాక్షి నొక్కతెం గదిసి మారుని నక్కనకాంగి జంకెన చూపులు జంకించె...'

'తల్లీ! తుంటవిల్తునిం గంటిమంటలచే మంటఁ గలిపిన ముక్కంటి . కామారికిం, గామాతురత్వంబు గలదే?'

‘విశ్వామిత్రుండు, మేనకను ముద్దు బెట్టుకొని, కచంబు నిమిరి, కుచంబు లంటఁ గమకించుటఁ గంటివా!'

'అమ్మా! యమ్మౌనివరుండు మహారాజరాజేశ్వరుండై, యపరిమితభోగంబు లనుభవించి, రోసి యాశాపాశంబులు తెగఁగోసి, విరక్తిం బొంది, బ్రహ్మత్వంబుఁగోరి మహాతపంబు సేయుచుఁ గురుకులంబునకు