పుట:సారంగధరచరిత్రము (సముఖము వేంకటకృష్ణప్పనాయకుఁడు).pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సారంగధరచరిత్రము

ఎనిమిదవ అధ్యాయము

అప్పుడు ప్రోడలగు చేడియ లాచేడియం జూచి, యక్కుమారుని చక్కదనంబును, యాచక్కెరబొమ్మ యక్కఱయుం జూచి, 'నేఁటి కిబ్బోటి కేమో పాటు వచ్చునని తోఁచుచున్నయది. ఇత్తఱి, యా బిత్తరి కింత తత్తఱం బేమిటికి? సూటిగానిచోట మోహంబు బాటించుట భాతి గాదు. ఇవ్విధంబు మాను మని బలికినఁ బగతుల మగుదుము. ఈ వనితను మనము మానుపలేము. దైవగతి విపరీతం బయ్యెనని దోఁచుచున్నయది. మేమి సేయంగలవారము? ఆయమ్మ నియమించు చందంబున నుండుద, మిక్రమీద నెటులయ్యె నట్టులగుఁ గాక!' యని గుస గుసలం బోవుచు నటునిటు నడయాడుచుండ, చిత్రాంగి విచిత్రంబైన మేడ మీద కతనిఁ దోడుకొని, తన పదపద్మరాగంబులు సౌపానపద్మరాగంబులు, పరస్పరంబు సంధింప, బంగరుశలాకయుం బోని యంగవల్లికాంతియు నచ్చటి కవాటంపుకుందనంపుతళుకులు నెయ్యంబున వియ్యంబులంద, పలకవజ్రంబులగవాక్షులు తనకటాక్షశాంతు లక్షులు నేకీభవింప, తృణగ్రాహి నీలమణిమయంబులైన కంబంబులడంబులు తన నీలాలకకదంబంబుల నొండొంటి నొరసికొని విలాసినీమణిప్రభావిభాసమానంబులైన చవికె, లుప్పరంబులు, తిన్నియలు, జవాదిగిన్నియ లిడినఠావులు, నాదియైన వినోదంబు, లాతనికిం జూపుచు, మేడమీదికిం బోవు నప్పుడు, చంద్రకాంతమణిమయంబు లైన యరుంగుల రంగులు, యింద్రనీలమాణిక్యమయస్తంభకాంతులు రెండునుఁ బెనంగొని గంగాయమునాసంగమంబులభంగి నెఱింగించె. నాయకంబులైన పద్మరాగకాంతినికాయంబులు సాంధ్యరాగంబు చందంబుఁ గందళింప,