పుట:సారంగధరచరిత్రము (సముఖము వేంకటకృష్ణప్పనాయకుఁడు).pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెన్న యుండఁగా నేయి లేదని చింతింపనేల? నీ వెన్నండును నన్నుఁ జూడరావని దూరుచునుంటి; ఇప్పుడు నాపై నెనరు గలందులకు గురుతుగంటి, నిన్నుఁ గూడి మనంగంటి; నాదు యపరంజిమేడ నీ వెన్నండునుఁ జూడరావుగదా! యీయింద్రనీలంపుసోరణగండ్ల యందంబు, యాసొగసు గొప్పటోవరుల చందంబు, నాకలువలరాయల రాతియరుంగుల రంగులు, నాహరువంజి(హురుమంజి)ముత్యముల మేలుకట్లును, నీమగరాల నిగరాల గోడల వేడుకలు నిచ్చు కీరపారావతాదుల వినోదంబులు, తక్కునుం గల విశేషంబుల సంతోషంబునఁ జూచి, యామానికెపుటోవరులందు పువ్వులపాన్సున కమ్మతెమ్మెరలు వీవఁ గొంతసేపు పవ్వళించి, గంధము చెక్కలాకులు గైకొని పోదువుగాని ర’ మ్మన—

అప్పుడమియొడయని కొడుకు వెడనగ వంకురింప నప్పడంతుకం జూచి, 'సత్వరంబుగాఁ జనవలయు, ప్రాణపదంబగు నాపావురంబు యిచ్చోట వ్రాలె, నీవు మాపినతలివి గావున రవికిరణంబుల కేనియుఁ జొరఁగూడని యంతఃపురంబునకు వచ్చి నీపదంబులకు మ్రొక్కితి. నీకటాక్షంబున నన్నిభాగ్యంబులు గల్గియున్నయవి; కాలయాపనంబు సేయక పావురం బొసంగినం బోయెదు ననిన, నక్కురంగలోచన లోచనాంచలంబుల నించుకించుక చక్కచిక్కనిచంద్రిక లీనం జూచి, నవ్వుచు, 'నింత తీవరంబేమి? యించుకసేపు విశ్రమించి పోవుదువు గాక' యని, యారాచపట్టిఁ జేపట్టి నట్టియాసల నాదిట్టతోడనే లేచి మట్టుమీఱిన మోహంబునఁ బయిడిమేడకుం దోడుకొని పోయెను.

గద్యము.
సముఖ మీనాక్షి తనూభవ వేంకట కృష్ణప్ప నాయక
ప్రణీతంబైన సారంగధరచరిత్ర
వచనకావ్యంబునందు
యేడవయధ్యాయము.