పుట:సారంగధరచరిత్రము (సముఖము వేంకటకృష్ణప్పనాయకుఁడు).pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

—అంత సారంగధరుండు బినతల్లిం గనినయంత, భయభక్తివినయసంభ్రమంబులు మనంబునఁ బెనఁగొన సాష్టాంగముగా మ్రొక్కిన నా జక్కువగుబ్బలాడి గ్రక్కునఁ జేతులు జాచి లేవనెత్తి తనచనుగుబ్బమొన లొకించుక నతనియురంబు సోఁకఁ గౌఁగలించుకొని, మొగంబు మొగంబునం జేర్చి చెక్కిలి నొక్కి ముద్దుఁబెట్టుకొని, నొక్కు చునుండు నచ్చేడియం గాంచి యాకుమారుండు బినతలికిం దనమీదినెనరు మిక్కిలి గావున నక్కరణి నాదరించె, నిది తక్కువ గా దని తలంచి, కరకమలంబులు ముకుళించి, 'రాజు లేనివేళ నే నిందు రాఁజెల్లదు; తల్లీ! యుల్లంబు సైచుకొమ్మనుటయు, నమ్మటుమాయలాడియు, 'నిట్లు పలుకంగాఁ దగునే? నీవు నావసుధావల్లభుండు నొక్కరూపంబు గావున తడఁబడి మొక్కఁజెల్లునే,' యని సుశీలయుంబలె నాదుశ్శీల చేయిఁ జాపి, ముందుగ విచ్చేయుమని యమ్మహాత్మునిఁ దోడ్కొని, 'అతివినయం ధూర్తలక్షణ' మ్మనువిధంబున నరిగి కప్పురంబులు చిలికిన చల్లనిపన్నీట నాతనిపాదంబులు గడిగి యొత్తించి, బేర్చిన ముత్తియంబులు జేర్చిన పసిండిగద్దియఁ గూర్చుండ నునిచిన, యానరేంద్రనందనుండు, ‘జననీ! తక్కినవారికిం బలె యింత యుపచారం బేమిటికి? యేను నీకుమారుండనుఁ గానే!' యనుటయు నా పువ్వుఁబోఁడి, బొమ్మంచుకెమ్మోవిచిగురునం జిరునగవుమొలకలు గులుక, కప్పురంపువీడియంపుతావి ఘుమ్ము మన, తేనియచినుకు లొలుక నిటు పలికె; 'ఓ జగన్మోహనాంగ! నాకుమారుండ వగుదువు, నిక్కంబు పలికితివి. నీదుసుగుణత్వంబును, నీచక్కఁదనంబు నీ యొయ్యారంబు నిచ్చెలులు నిచ్చలు పలుక విని వీనులకు విందు లయ్యె; ఇప్పుడు కనుంగొనుటచే కన్నులకుం బండువయ్యె, నాకోరికలు లభించె, నే నోఁచిననోములు ఫలించె; చంద్ర జయంత వసంత కంతు నలకూబరాదుల చక్కఁదనంబులు విన్నదియే గాక కన్నది లేదు. డెందంబున కానందంబు కదలింపఁ గన్నులార నినుఁ జూడఁగంటి, నామనంబునం గల్గుదుందుడుకులు నేఁటితోడం దీఱె; కామినీకుసుమసాయకా! నీవంటి నిధానంబు గల్గుటంజేసి యెంతటి పలుకులకుఁ జింతవలదు, పచ్చవింటివజీరునింబోలు నీవు వచ్చుటం జేసి రాజేంద్రుండు రాలేదను పరితాపం బేటికి?