పుట:సాక్షి పానుగంటి లక్ష్మీ నరసింహారావు.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ్రామ్యభాషా గ్రంథ పఠనము

9

జంఘా-నాతోవారు మీ రిద్దఱేనా? శ్రీ జగన్నాథ రామలింగేశ్వరదైవతద్వయ మధ్య భూమిని హైందవుడయి కాని, ముసలిమానుఁడయి కాని పుట్టు వొందిన ప్రతి మనుజుఁడు నాతో వాఁడే. కారణాంతరముల నెవరైనఁ బైకి వ్యతిరేకాభిప్రాయముల నిచ్చినను బరమార్థమున నాతోవారే. నేను శంకరాచార్యులఁ గొలిచిన, వారు రామానుజాచార్యులఁ గొల్తురు. మఱి వారు మరిడీమహాలక్ష్మిని గొలుతురు. పూజలలో మాకైక్యములేదు. వీరు బాలవితంతువును మంగలిపొదియొద్దఁ గూర్చుండఁబెట్ట, వారామెను మారుమగని ప్రక్కలోఁ బన్నుండఁబెట్టెదరు: ఆచారములలో మాకైక్యములేదు. బ్రహ్మసృష్ట్యాదినుండి వచ్చుచున్న వేదముల యపౌరు షేయ జననమును గూర్చి, పునర్జనన వాస్తవమును గూర్చి మాలో మాకైక్యములేదు. ఆత్మపరమాత్మ తత్త్వసంబంధములఁగూర్చి మాలో మా కైక్యము లేదు. మోక్షో పాయములఁ గూర్చి మా కైక్యము లేదు. కాని యీయంశమును గూర్చి ప్రాక్పశ్చిమ సముద్ర మధ్య దేశసంభవుల కందఱకు నైక్యము కలదు. నీవు మాత్రము వాదమునకై యాంగ్లేయసభ్యుఁడ వైతివని మే మెఱుఁగమా?

కాలా-మన వాదమున మధ్యస్థుఁ డెవఁడైన నుండవలదా? బొఱ్ఱయ్య సెట్టిని బిలిపించి, కొంచెము సేపు వీథిలోఁ గూర్చుండఁబెట్టిన బాగుగ నుండు నేమో! ఆతఁడు వెలుపలఁ గూర్చుండుట బాగుగ నుండనియెడల, నాతనివిడి యిత్తడి చేయినైనఁ దెప్పించి యధ్యక్షపీఠమున నుంచవలయును. మధ్యస్థుఁడు లేనివాద మసమంజసము.

జంఘా-గ్రంథముల గొడవయే యెఱుఁగని కోమటివాని మాధ్యస్థ్యమేమిటి? మనకు మహేశ్వరుఁడే మధ్యస్థుఁడు కానిండు.

నేను-కొంతకాలము క్రిందట నన్ని పరీక్షలకు దేశభాషలు నిర్బంధపఠనీయములుగ నుండెను. ఆ పద్ధతి సంతుష్టికరమైన యభివృద్ధి నీయలేదు. దేశభాషాగురువులగు పండితులు బాలుర కభ్యసింపఁ జేయవలసిన సులభరీతు లెఱుఁగక తెలివితక్కువ తలతిక్క రోఁకటి పాటలక్రిందఁ బెట్టి “కః కిమ్, కస్య, క్యాకర్ కర్ " అను ననావశ్యకములగు నకాలపువెఱ్ఱియా కాంక్షల క్రిందఁబెట్టి నిరంతర సంబంధమున్న భాషావ్యాకరణములలోఁ దీర్ఘమునకుఁ దీర్ఘము, ప్రసాధమునకుఁ బ్రసాదము ననునట్లు భాషలో నెంతమాత్రము బాలురఁ బ్రవేశపెట్టకుండ వ్యాకరణము భాష్యాంత మభ్యసింపఁజేసి వ్యాకరణపాఠమును గట్టి భాషాపాఠమునే చెప్పి వేదముల నపహరించిన సోమకాసురునాఁటి వెఱ్ఱిపద్ధతులనే యవలంబించి భాషాపఠన మంతయుఁ బలువిధములఁ బాడుసేయ బాలురు భాషాభ్యసనమునఁ బరమాసహ్యతాయుక్తులయిరి. అనివార్యపఠనపద్ధతిని బట్టి వచ్చిన ముప్పిదిగదా? యని యెంచి దేశభాషలు పైపరీక్షలకు స్వేచ్ఛాపఠనయోగ్యములుగఁ జేయఁబడినవి.

జంఘా- పైపరీక్షలకేనా? 4-వ ఫారం మొదలుకొని స్కూల్ ఫైనల్ వఱకు భాషాపఠనము నిర్బంధము సేయఁబడినదా? దాదాపుగా 12 సంవత్సరములున్న 4-వ క్లాసు పిల్లవాఁడు దేశభాషను వదలుకొనవలసినదా? ఏ దేశముననయిన నిట్లే జరుగుచున్నదా? మీ కింగ్లీషు దేశ భాషకదా? మీరు దేశ భాష నిట్లే పరిత్యజింపఁజేయఁబడితిరా? మీరు ల్యాటిను గ్రీకు మొదలగు నాది భాషలు నేర్చుకొనునప్పు డింగ్లీషు భాషామాధ్యస్థ్యముననే నేర్చుకొనలేదా? దానిని వదలి నేర్చుకొంటిరా? మీయభివృద్ధికి దేశభాష యావశ్యకమై మాయభివృద్ధి కాటంకమయినదా? పోనీ (School Final) స్కూల్ ఫైనల్ వఱకయిన