8
సాక్షి
కొంపలు కాలుచున్నవా యేమి!" యనుచు నేను లేచితిని. నా వెనుకనే కవియు గలము చేతఁ బుచ్చుకొని “సహజోక్తి ప్రధానమైన యాధునిక కవిత్వ మభ్యసించు నాకీయనదృష్టమున లభించెను. కాలుచున్న కొంపలు గాలుచున్నట్లుగనే వర్ణింతు నని లేచేను. కాలాచార్యులు “పొడు మెక్కడనయిన దొరకును. నేనును వత్తును" అని ముక్కు ముమ్మారు టొకాయించి లేవఁబోవుచుండెను. నెత్తిపయిఁ దగిలిన దెబ్బనుండి చిమ్మి రక్తమును దుడుచుకొనుచుఁ గొంతసేపు జంఘాలశాస్త్రి మాటలాడక యుండి "కొంప కాలుచున్నవా యందురా? యీయూరుకొంపలా? యీతాలూకాకొంపలా? యీజి కొంపలా? యిట్టియనేకములగు జిల్లాల కొంపలు గాలుచున్నవా? యని యడుగుఁ దేశభాష బ్రదు కేమైనదో తెలిసినదా? యిదిగో వార్తాపత్రిక-నాకుఁ గొంత తెలిసినది. కొంత తెలియలేదు." అని దానిని బల్లపై వైచెను. ఇంతేకద! తొందరలేదు. కూరుచుండుఁడు నాకును దెలిసినది. దేశీయభాషలను నింటర్మీడియేటు బియేక్లాసులలో ననివార్యములు పఠనీయములుగఁ జేయుటకు విద్యాసంఘము వారంగీకరింపలేదు. ఇందువలన దేశజనులకు గొంత యసంతుష్టిగ నుండవచ్చును.
జంఘా-కొంతయసంతుష్టియా? అవధిలేనియసంతుష్టి. ఉండవచ్చునా? ఉన్న ఉండితీరినది. మనదేశ భాషలు గదా! మనము మాటలాడుకొను భాషలుకదా! ఏ భాషలలో బుట్టి పెరిఁగి చత్తుమో యాభాషలుకదా? మనపుత్రులేమి, పౌత్రులేమి, మనసంతతి వారందఱు ప్రపంచము నిల్చియున్నవఱకు నభ్యసించి యభివృద్ధిపఱచుకొనవలసిన వ భాషలు కదా! మనమాట లిందునుగూర్చి విననక్కఱలేదా? విశ్వసింప నక్కఱలేదా? మా చరిత్రాదికము కాదే? వారి గణితాదిశాస్త్రములు కావే? వారికీ పట్టుదల యేల?" వారికి దేశ భాషానిరాదరణమేల? హిందూదేశములో స్థాపించిన హైందవసర్వకళానిలయము (Indian University) లో దేశభాషలే పఠనార్హములు కాకుండఁ జేయునంత గొప్పపూచి వారేల వహింపవలయును? ఆహా! వారిలో నొక్కఁడయిన మన కామోద (Vote) మీయలేదు
కాలా-వారెవరు?
జం-ఆంగ్లేయభాషాపండితులగు గురువులు (Professors).
నేను-వారు నిర్హేతుకముగ మనవారికోరికను నిరాకరించిరా? అటు లెన్నఁడును లేదు వారికున్న హేతువులుగూడఁ గొన్ని బలీయములే యైయుండు. మన మిందునుగూడ సావకాశముగ మాట లాడుకొందము.
కవి - పరిపాలకులఁ గూర్చియు, వారి కార్యములఁ గూర్చియు మనము మాటలాడుకొనఁగూడదని నిబంధన ముండఁగ-
నేను-ఆ నిబంధనము పరిపాలనతంత్రములఁ గూర్చినదికాని దేశమునకుఁ బ్రాణమై భాషనుగూర్చి జరిగిన యేర్పాటుల న్యాయాన్యాయములు మాటలాడుకొనుట కభ్యంతర ముండదు. జంఘాల శాస్త్రీ! ఆంగ్లేయ సభ్యుల యందఱ యభిప్రాయముతో నేకీభవించు వాఁడను నేను. కాలాచార్యులును కవి నీతో నేకీభవింతురా? నాతో నేకీభవింతురా?
కాలా. & కవి-మేము జంఘాలశాస్త్రితో వారమే!