10
సాక్షి
దేశభాషలు చదువకతప్పనివిగఁ జేసితిరేమో! పై పరీక్షలకు వాని యనివార్యపఠనమంత యావశ్యకము కాదేమో యని మాలో మేము కన్నులు తుడుచుకొందుమన్న నేదీ? కాకి కుక్క కథలు ముగిసిన వెంటనే మాభాషాపాండిత్యమున కాశ్వాసాంతమైపోయెనే! మా దేశీయ గ్రంథపఠనదీక్ష కవబృథస్నాన మైపోయెనే! తగిన భాషా గురువులు లేకుండుటచే భాష యందు బాలురకు వేదాంతము ముదిరినదా! ఆహా! ఇది యెక్కడి హేతుకల్పనము? పూర్వభాషాపండితు లంత నిరుపయోగులనియే మీకుఁ దోఁచినదా? నలువదియేఁబది వత్సరముల లోపునఁ గలిగిన నవలాకారకులు, చరిత్ర కారకులు, శ్రవ్యదృశ్య ప్రబంధకారకులు, భాషాంతరీకరణ సమర్థులగు దేశీయు లిందఱు మీరు చెప్పిన తలతిక్క, తెలివితక్కువ, యెదుగుబొదు గెఱుఁగని కృతయుగపండిత స్థాణుజాతి వారివలన నిట్టిలోకోపకారస్థితిలోనికి వచ్చిన వారే కారా? ఇట్టి వీరి కందఱకు నాంగ్లేయభాషాప్రవేశముగూడఁ గొంచెముగనొ విశేషముగనొ యున్నదికదా? వీరందఱుగూడ నింగ్లీషుతోడ దేశభాషను నిర్బంధముగ నభ్యసించినవారగునా? కాదా? పూర్వపద్దతి సంతుష్టికరమగుఫలము నీయకపోవుటచే నీనవీనపద్ధతి కల్పింపఁబడినది అని మీరు చెప్పుచున్నారుగదా? ఇది సాహసమైన మాట కాదా? ఒకవేళ మీరభిప్రాయపడునట్లు దేశీయభాషా గురువగు పండితుఁడు సమర్థుఁడే కాకపోవచ్చును. పురాతనపుఁదుక్కే కావచ్చును. అతనిని బాగుచేయవలయును. అతనిని బ్రస్తుతస్థితి కుపయోగించునట్లు మార్పవలయునుగాని యాతనిని బట్టి మా బాలురకు భాషలనుండి బహిష్కారమా? భాషలకుఁ బఠనశాలనుండి బహిష్కారమా?
నేను-మీ భాషలను జదువుకొనవలదని మీ బాలుర నెవ్వరిని బ్రతిబంధింపలేదు. ఇష్టమువచ్చినవారు చదువుకొననే వచ్చును. అట్టి స్వేచ్ఛవలన భాషాభిరుచి పుట్టును. బలాత్కారము లేదు.
జంఘా-వారి యిష్టమేమిటి? ఇంటర్మీడియేటు క్లాసులోనికి వచ్చు బుద్ధిమంతుఁడైన బాలునకుఁ బదునాఱు సంవత్సరము లుండ వచ్చును గదా? తిన్నగ నాలుగుమాటలు మాటలాడుటకైన శక్తి కలిగియుండఁడు కదా? అట్టి బాలునకు దేశ భాషను మానుటకుఁగాని చదువుటకుఁగాని స్వేచ్ఛయా? ' వానికిఁ దోఁచినయెడల మానవలసినదా? వాఁ డంతటి దీర్ఘాలోచనపూర్వకమగు కార్య మావయసులోఁ జేయఁగలఁ డనియే మీ రనుకొందురా? మీ రట్టివయసులో నట్టి యాలోచనఁ జేసికొనఁగలరా? బలాత్కారము చేసినందువలన భాషాభిరుచి గలుగదు. కాన స్వేచ్ఛ నిచ్చితిమని యిది యొక క్రొత్తసిద్ధాంతమా? ఈ సిద్ధాంతము మీయాంగ్లేయభాష కేల యుపయోగించు కొనఁగూడదు? ఇక్కడఁ దిరుగ వ్యత్యాసమా? ఇది మాదిక్కుమాలిన దేశ భాషలకు మాత్రమే చెల్లవలసినదా? రాజభాష యొకటియు, దేశభాష యొకటియు నెప్పుడుగాని యెంతవయస్సుగల బాలునకుఁగాని నిర్బంధపఠనీయములుగ నుండవలసినదే! ఇతర విషయములు స్వేచ్ఛాను సారములుగ నుండవచ్చును.
నేను-ఇంటర్మీడియేటు బి.యే. పరీక్షలకుఁ బోవు బాలురకు దేశీయభాషావ్యాసములఁ బరీక్ష యున్నది కాదా? అది చాలదా?
జంఘా-ఉన్నది ఉన్నది, ముమ్మాటికి నున్నది. భాష లీరీతిగా నుధ్ధరింపఁబడుచున్నవా? బాగు. భాష లక్కఱలేదా? భాషలలోఁ బాఠములు మీరు చెప్పరా? భాషాపరిజ్ఞానము