పుట:సాక్షి పానుగంటి లక్ష్మీ నరసింహారావు.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

సాక్షి


తన కియఁబడిన, యొక్క టైన ప్రకృతిని - మాఱఁగూడని యొక్క టైన ప్రకృతిని- సమయనుగుణముగ, సందర్భానుసారముగ, సన్నిహిత వ్యాపార సముచితముగ, స్వప్రయోజనప్రద మగునట్లుగఁ బదునాలుగు ప్రకృతుల క్రింద మార్చి, లేక మాఱున ట్లితరుల కగపఱచి తన్ను సృజించుటయందు భగవంతుడు వెల్లడిచేసిన నైపుణ్యమును-దన్ను దన్నుఁగానివానిఁగా నితరులకుఁ గనఁబఱచుటయందు వెల్లడి చేయుచున్న తన మాయా సృష్టి నైపుణ్యము-నెదుట సిగ్గుపడునట్లు వెలవెలఁబోవునట్లు - తలవంచు కొనునట్లు మొగము మాడ్చుకొనునట్లు సేయుచున్నాఁడు. తాను చేసిన యీ బొమ్మలు మాయా జగన్నాటక సూత్రధారుఁ డయిన తనకంటె మహామాయావిశేషాన్వితములై చిత్రచిత్రము నేత్రాభినయములచే హస్తాభినయములచే నవనవ పాదాభినయముల నాట్యములచే నొంటి కాలిభరతములచే వింతవింతలుగ తెయితక్కలాడుచున్న వని లోన సంతోషించుచు యున్నాఁడో లేక వేయఁగూడని వేషములు వేసినందులకుఁ, బూసికొనఁగూడనిపూఁతలు పూసికొనినందులకు, ధరియింపఁగూడని దుస్తులు ధరించినందులకు, వేయఁగూడని గంతులు వేసినందులకుఁ బాడఁగూడనిపాటలు పాడినందులకు, నాటకాంతమునఁ బాత్రములను శిక్షింపఁదలఁచియేయున్నాఁడో, యెట్టివాఁడో, యెక్కడ నున్నాఁడో, యేమి చేయుచున్నాఁడో, యేకాకి యగువానికీ విఱుగుతఱుగులేని జంజాట మెందులకో యెవ్వడెఱుఁగని యీశ్వరునిఁగూర్చి యెట్లు చెప్పఁగలము? నవ్వు సంతోషమునకు, నేడ్పు దుఃఖమునకు సూచకములని వెఱ్ఱి భగవంతుఁడు స్థూలవిభాగ మేర్పఱచియుండ . బుద్ధి నిధులైన మన వారెట్టియెట్టి సూక్ష్మసూక్ష్మతర సూక్ష్మతమ విభేదములఁ గల్పించి వెల్లుల్లిపారను వేయివిధములుగా నెట్లు చీల్చినారో చూడుఁడు!

“ఉహుఉ" అని పండ్లు గనఁబడని పెదవులు విడని మూతిగదలని మొగమున వికాసము లేని నవ్వు-పై పెదవి మాత్రము కొంచెముగదలి పై రెండుపండ్లు మాత్రమే కనఁబఱచి ధ్వని యెంతమాత్రమును లేకుండ నవ్విన నవ్వు - అడుగు పెదవి పై పెదవి కొంచెము గదల్చి పై రెండుపం డ్లడుగు రెండుపండ్లును గనఁబఱచి “హు హు హు" అని యిగిలింపు గలుగునట్లు నవ్విననవ్వు-పై పం డ్లడుగుపండ్లతో గట్టిగఁ జచ్చువానికివలె దాకొల్పి పెదవులు మాత్రమే కదల్చి కిలకిలగ నవ్విననవ్వు-నోరు బాగుగఁ దెఱచి “హాహాహా యని నవ్విన వెఱ్ఱి నవ్వు-మొగ మేడ్చునట్లు చేసి హే హే హే లతోఁగూడి నవ్విన నవ్వు-ఇట్లనేక విధములుగ వీని బాహ్యచిహ్నము లుండును. వీనికి మొలకనవ్వు- మొద్దునవ్వు కిచకిచ నవ్వు-కిలకిల నవ్వు - ఇగిలింపు నవ్వు-సకిలింపునవ్వు-అని వివిధ నామములు గలవు. వీనిలో నేనవ్వు కూడఁ బ్రీతి సూచకమైనది కాదు. ఒక నవ్వున కర్థము రోఁత. ఒక నవ్వు తిరస్కార సూచకము. కుండలోపలి యభిప్రాయము పై కగపడకుండ మూసిసమూకుఁ డొకనవ్వు-ప్రత్యుత్తరము చెప్పనిష్టములేక వేసినకప్పదాటొకనవ్వు - కోప మడఁచుకొనుటకై తెచ్చుకొన్న నన్వొకటి. “ ఓరీ! చచ్చుముండకొడుకా! " యను నిరక్షర మైన తిట్టొకనవ్వు. ఇట్లే కోపమునకు రూప భేదములు, నామ భేదములు, నర్థ భేదములు, నభిప్రాయ భేదములు గలవు. ఇప్పటి నవనాగరకుఁడు తన శత్రువును జూచిన తోడనే. ఏమి యుత్సాహము! ఏమి శిరఃకంపములు! ఏమి కరసంచాలనములు! ఏమి తియ్యమాటలు! ఏమి కౌఁగిలింతలు! ఏమి పరకష్టాసహిష్ణుతాసూచక విలాపములు! ఓహో! లోపలి యగ్నికిఁ బై కెంతచల్లదనము! లోని విషముష్టికిఁ బై కెంతమాధుర్యము! లోని పిశాచమునకుఁ బై నెన్ని