Jump to content

పుట:సాక్షి పానుగంటి లక్ష్మీ నరసింహారావు.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xii

యువపాఠకులకు....

నా చిన్నతనంలో నేను చదివిన మొదటి జనరల్ బుక్స్‌లో 'సాక్షి' ఒకటి. మా స్వగ్రామానికి సమీపంలోని లైబ్రరీ నుంచి 'సాక్షి' సంపుటాలను వారంవారం తెచ్చుకొని చదవడం నాకు ఒక హాబీగా ఉండేది. నాకు ఏ కాస్తో తెలుగు రాయడం; రావడానికి ఒక కారణం ఆనాడు నేను చదివిన పానుగంటి వారి 'సాక్షి' అని సగర్వంగా చెప్పగలను.

పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు 'సాక్షి' వ్యాసాలను గ్రాంథికశైలిలో రాశారు. అయితే, అది గొడ్డు గ్రాంథికం కాదు. వ్యావహారికానికి దగ్గరగా వుండే గ్రాంథికశైలి. అప్పటికే, ప్రముఖ రచయితలందరు వ్యావహారిక భాషనే అవలంభించినప్పటికీ ఇంకా గ్రాంథికభాషలో పలువురు రాస్తూ ఉండేవారు. అయినా, ఆ గ్రాంథికం దాదాపు వ్యావహారికమనే అనిపించేది. ముఖ్యంగా పానుగంటి వారిది గ్రాంథికశైలి అయినా చాలా సులభంగా, సరళంగా, సుందరంగా ఉండేది. 'సాక్షి' వ్యాసాల శైలి ఝరీవేగంతో పరుగులెట్టేది. రాజమండ్రి వద్ద వరద వచ్చినప్పటి గోదావరిలా ప్రవాహ సదృశంగా ఉండేది. ఆ రోజుల్లో కుర్రకారుతో సహా ఎందరో ఎంతో ఆసక్తిగా 'సాక్షి' వ్యాసాలను చదివేవారు.

ఈ వ్యాసాలను 1920 ప్రాంతాలలో మొదటగా 'ఆంధ్రపత్రిక' సారస్వతానుబంధంలో వారంవారం ప్రచురించేవారట. ఆ వ్యాసాలు ఆగిపోయిన తర్వాత అవన్నీ సంపుటాల రూపంలో వచ్చాయి. ఆ రోజుల్లో అవి కలిగించిన సంచలనం ఇంతా అంతాకాదు. 'జంఘాల శాస్త్రి' అనే పాత్ర ముఖతః పానుగంటి వారు సమకాలిక సంఘ దురాచారాల మీద, అనాచారాలమీద, మూఢవిశ్వాసాల మీద పదునైన విమర్శలు చేసేవారు. ఇన్నేళ్ళ తర్వాత వాటి పునర్ముద్రణకు ముందుకు వచ్చిన 'అభినందన పబ్లిషర్స్'ను ఎంత అభినందించినా తీరదు.

'సాక్షి' వ్యాసాలపట్ల ఆనాటి ఆకర్షణ, కుతూహలం ఈనాటికీ తగ్గలేదనడానికి ఒక నిదర్శనం 'అభినందన' వారు అనతికాలంలోనే 'సాక్షి' సంపుటాలను పునః పునర్ముద్రించవలసి రావడం. ఇప్పటికే వారు ఒక 15 సంవత్సరాలలో రెండు సార్లు వాటిని మూడేసి సంపుటాలలో పునర్ముద్రించారు. ఈసారి వారు అన్ని సంపుటాలను కలిపి ఒకే బృహత్ సంపుటంగా ప్రచురిస్తున్నారు.