Jump to content

పుట:సాక్షి పానుగంటి లక్ష్మీ నరసింహారావు.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xiii

'అభినందన' వారు పునర్ముద్రించిన సంపుటాలలో ప్రతి వ్యాసానికి ముందు వివరణలు రాసిన వారు ప్రముఖ రచయిత శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు. ఆయన వ్యాస సారాంశాన్ని ప్రతి వివరణలోను పొందుపరిచి వ్యాసం చదవడానికి కుతూహలం కలిగించారు. అలాగే పండితకవి శ్రీ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు ఈతరం వారికి 'సాక్షి' వ్యాసాలను పరిచయం చేస్తూ రాసిన ప్రశంసా వాక్యాలు కూడా ఈ సంపుటాలలో పొందుపరిచారు. ఈ సంపుటాలలో అదొక ఆకర్షణ.

ఒకటి మాత్రం నిశ్చయంగా చెప్పగలను. మొదటిసారి నా చిన్నతనంలో చదివినప్పుడు కలిగిన త్రిల్ మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత 'సాక్షి' వ్యాసాలను చదువుతున్నప్పుడు కలిగింది. అదంతా పానుగంటి వారి శైలి మహత్యం. ఆ త్రిల్ ఎలాంటిదో తెలుసుకోవాలంటే మీరూ ఈ వ్యాసాలను ఆమూలాగ్రం చదవండి.

21-03-2006

విజయవాడ.

నండూరి రామమోహనరావు