పుట:సర్పపురమాహాత్మ్యము (కూచిమంచి తిమ్మన).pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీసర్పపురక్షేత్రమాహాత్మ్యము.

పద్యప్రబంధము కూచిమంచి తిమ్మకవి కృతము.

ఇది 'అభినవవాగనుశాసనుఁడు' 'కవిసార్వభౌముఁడు' అను బిరుదము లంది క్రీ. శ. 17, 1 శతాబ్దముల మధ్యకాలమున విలసిల్లిన కూచిమంచి తిమ్మకవి క్రీ. శ. 1754 సంవత్సరము రచించినప్రబంధము. ఇందలి కథాభాగము బ్రహ్మకైవర్తపురాణోక్త మైనసర్పనగరక్షేత్రమాహాత్మ్యమునకు ఆంధ్రీకృతి. అంబరీషచక్రవర్తియాస్థానమునకు వసిష్ఠమహర్షి విచ్చేసినపుడు అంబరీషుఁ డాతనిం బూజించి కుశలసంభాషణానంతరము 'సర్పపురాఖ్యాన మెట్టిది? భావనారాయణ వుఁ డట నేల యుదయించె? ఆదేవు నచట నెవ్వరు ప్రతిష్టించిరి? అందలిపుణ్యసరోవరము లెవ్వి? ఆతీర్థములఁ గ్రుంకులిడిపఫల మెట్టిది?' అని యడుగఁగా వసిష్ఠుఁ డీమాహత్మ్యము నుగ్గడించెను.

ఈసత్ప్రబంధమును దొలుత నీలాసుందరీపరిణయముతోఁ గలిపి వావిళ్ళవా రెపుడో ముద్రించిరి. ఆ తరువాత నిదియే ద్వితీయముద్రణమై యుండును. కూచిమంచి తిమ్మకవి మహాకవిసార్వభౌముఁడు. ఈతని కవిత్వము ఏనుఁగు లక్ష్మణకవిమాటలలో:

"హాటక గర్భవధూలీ
లాటన చలితాంఘ్రి నూపురారావ శ్రీ
పాటచ్చరములు తేనియ
తేటలు మాకూచిమంచి తిమ్మయమాటల్."

కవిత్వమా మృదుమధుర మైనది. కావ్యవస్తువా పరమపవిత్రమైనది. కాకినాడకు రెండుమైళ్ళలోఁ గలయీపవిత్రక్షేత్రమాహాత్మ్య మెల్లరకుఁ బారాయణయోగ్యము. ఈయుత్కృష్టప్రబంధమును జక్కనికాకితములపైఁ జక్కఁగా ముద్రించి ప్రకటించిన శ్రీ సర్పవరదేవస్థాన ట్రస్టీ లభినందనీయులు.

ఇట్టి గ్రంథమున కొకసమగ్ర మగుపీఠిక, తేటతెల్ల మగుకథాసంగ్రహము సమర్థుఁ డగుపండితునిచే వ్రాయించి చేర్చి యుండినచో గ్రంథగౌరవ మినుమడించి యుండెడిది. ప్రాచీనప్రబంధముల నచ్చువేయించి ప్రకటించువా రిట్టిపీఠికాదుల విలువ గ్రహింపక పోవుట పెద్దలోపము.