Jump to content

పుట:సర్పపురమాహాత్మ్యము (కూచిమంచి తిమ్మన).pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీశారదామ్బాయై నమః

సర్పపురమాహాత్మ్యము

ప్రథమాశ్వాసము

⁠

శ్రీయును నీళయున్ ధరయుఁ జేరి భజింప నిలింపు లింపుగాఁ
బాయక సామగానరుచిఁ బ్రస్తుతి సేయ సుపర్ణశేషు ల
త్యాయతభక్తిఁ గొల్వ ననపాయసుఖోన్నతిణ బొల్చుభావనా
రాయణదేవుఁ డిచ్చు నఖిలైకశుభంబులు భక్తకోటికిన్.

⁠ 1

ఇష్టదేవతాదిప్రార్థనము

సీ.⁠

సనకాదిమునిమనోబ్జము లాటపట్టులు, హరియురస్స్థలము సింహాసనంబు
సకలబృందారకసతు లూడికపుఁజెలుల్, పొలుపారుపాలేఱు పుట్టినిల్లు
నలుమొగంబులవేలుపులపెద్దతొలుపట్టి, జగతీసతీమణి సవతిమిన్న
కలువలచెలికాఁడు గాదిలిసైదోడు, బ్రహ్మాండములు రంగభవనములును

⁠


తే.⁠

గాఁగ వేదాంతవీథులఁ గలసి మెలయు, నఖిలలోకైకజనయిత్రి యాదిదేవి
యిందిరాసుందరాంగిమన్మందిరమునఁ జెలఁగి, నిత్యంబు నృత్తంబు సేయుఁగాత.

⁠ 2


ఉ.⁠

శ్రీనగజాఘనస్తనవిసృత్వరసంకుమదైణనాభిపం
కానిశవాసితస్ఫుటభుజాంతరుఁ డిందుసుధాపయస్సదృ
గ్భూనుతకీర్తి పీఠపుర కుక్కుటలింగమహాప్రభుం డశేే
షానతభక్తపాలనపరాయణుఁ డీవుత మా కభీష్టముల్.

⁠ 3


క.⁠

మగనిసగమేన నెలకొని, ముగురంబలయందు నాదమూలం బగుచున్
జగ మేలుసర్వమంగళ, జగమే లిడుఁగాత మాకు సమ్యక్కరుణన్.

⁠ 4